వాషింగ్టన్ సుందర్ కు రీప్లేస్- వన్డే జట్టులో యువ స్పిన్ ఆల్‌రౌండర్ కు చోటు
ఇంగ్లాండ్‌తో లార్డ్స్ లో జరగబోయే కీలకమైన మూడో వన్డేకు ముందు భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అతని స్థానంలో సెలెక్టర్లు మరో యువ స్పిన్ ఆల్ రౌండర్ కు అవకాశం ఇచ్చారు. హర్ష్ దూబేను జట్టులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ కొద్దిసేపటి కిందటే అధికారికంగా ప్రకటించింది. ఈ మ్యాచ్ ఆదివారం జరుగనుంది.
కార్డిఫ్ సోఫియా గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డేలో వాషింగ్టన్ సుందర్ గాయపడ్డ విషయం తెలిసిందే. కుడి తొడ భాగంలో (హ్యామ్‌స్ట్రింగ్) గాయమైందతనికి. ఈ మ్యాచ్‌లో అతను 5 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే సుందర్ తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు కనిపించాడు. గాయం తీవ్రత కారణంగా అతను అర్ధాంతరంగా ఈ సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మిడాఫ్ వైపు పరుగు తీసే సమయంలోనే హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. ఆ తర్వాతి బంతికే అవుట్ అయ్యాడు.

ప్రస్తుతం సుందర్ తదుపరి వైద్య పరీక్షలు, నిపుణుల సలహాల కోసం స్కాన్‌కు హాజరయ్యాడు. గాయం తీవ్రత నేపథ్యంలో ఈ సిరీస్ నుంచి అతను తప్పుకోవాల్సి వచ్చింది. సుందర్ స్థానంలో హర్ష్ దుబేను తీసుకున్నారు. ఇదే ఇంగ్లాండ్ పై టీ20 మ్యాచ్ లను ఆడిన జట్టులో సభ్యుడు కూడా. జట్టులోకి వచ్చినప్పటికీ.. లార్డ్స్ వన్డేలో అతను ఆడేది అనుమానమే. స్పెషలిస్ట్ స్పిన్నర్ కులదీప్ యాదవ్ తుది జట్టులో తీసుకోవచ్చు.
కాగా.. ఇంగ్లాండ్ జట్టులో శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, హర్ష్ దూబే, కుల్ దీప్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్ ఉన్నారు. లార్డ్స్ వన్డే ఆడే తుదిజట్టులో సెలెక్టర్లు పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్ దీప్ యాదవ్ ను తీసుకోవడం దాదాపు ఖాయమైనట్టే.
మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్ లో ప్రస్తుతం 1-1తో భారత్, ఇంగ్లాండ్ సమవుజ్జీగా నిలిచాయి. దీంతో లార్డ్స్ వేదికగా జరిగే చివరి మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారింది. తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా, రెండో వన్డేలో పుంజుకున్న ఇంగ్లాండ్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నిర్ణయాత్మక సమరంలో కుల్ దీప్ యాదవ్ వైపే సెలెక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications