IPL 2024: ఈసారి ఐపీఎల్ లో ఆడుతున్న 10 జట్ల కెప్టెన్లు వీరే..!
ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే ఐపీఎల్ 17వ ఎడిషన్ పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. గతంలో జరిగిన ఎడిషన్ల కంటే ఈసారి మరింత హోరాహోరీగా టోర్నీ సాగే అవకాశం ఉందన్న అంచనాలు పెరుగుతున్నాయి. దీనికి ఓ కారణం పలు జట్లకు మారిన కెప్టెన్లతో పాటు ప్లేయర్లు కూడా. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2024లో పోటీ పడుతున్న 10 జట్లకు సారధ్యం వహిస్తున్న కెప్టెన్ల తాజా జాబితాను ఓసారి పరిశీలిద్దాం..
ఈసారి ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గతేడాది కెప్టెన్ గా వ్యవహరించిన దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ ఐడెన్ మార్ క్రమ్ కొనసాగనున్నాడు. గతంలో జరిగిన 2021 ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున కూడా ఆడిన మార్ క్రమ్ గతేడాది మాత్రం సన్ రైజర్స్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే తాను ఫర్వాలేదనిపించినా జట్టును మాత్రం లీగ్ దశ దాటించలేకపోయాడు. అయినా ఈసారి కూడా సన్ రైజర్స్ కు మార్ క్రమ్ కెప్టెన్సీలో మార్పు లేదు.

అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్ గా గత సీజన్ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ కొనసాగబోతున్నాడు. గతేడాది ఐపీఎల్ లో డూప్లెసిస్ మెరుపులు, జట్టుకు నాయకత్వం వహించిన తీరుపై ఫ్రాంచైజీ సంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ ఈసారి కూడా కొనసాగనున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనున్న చెన్నై జట్టుకు ఈసారి కూడా టైటిల్ అందిస్తే ధోనీకి అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా అరుదైన రికార్డు సొంత కావడం ఖాయం.
ఈసారి ముంబై ఇండియన్స్ కోచ్ గా రోహిత్ శర్మ స్ధానంలో హార్ధిక్ పాండ్యా నాయకత్వం వహించబోతున్నాడు. ఈ మార్పుపై ముంబై అభిమానులతో పాటు రోహిత్ అభిమానుల్లోనూ తీవ్ర అసంతృప్తి ఉన్నా ఫ్రాంచైజీ మాత్రం భవిష్యత్ అవసరాల్ని కారణంగా చూపుతోంది. అలాగే లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్ గా విశేషంగా రాణిస్తున్న కేఎల్ రాహుల్ ను ఈ సీజన్ లోనూ కొనసాగిస్తున్నారు. అటు కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ను ఎంచుకున్నారు. దీంతో నితీష్ రాణా స్ధానంలో అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుంటాడు. గతంలో కేకేఆర్ ను ఫైనల్ కు చేర్చిన రికార్డు అయ్యర్ కు ఉంది.
గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ గా ఉన్న హార్ధిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకోవడంతో పాటు కెప్టెన్సీ కూడా అప్పగించిన నేపథ్యంలో.. గుజరాత్ టైటాన్స్ కు మరో సీనియర్ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ నాయకత్వం వహించనున్నాడు. అటు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా శిఖర్ ధావన్ కొనసాగబోతున్నాడు. మరోవైపు రిషబ్ పంత్ తిరిగి రాకతో గతేడాది కెప్టెన్ గా ఉన్న డేవిడ్ వార్నర్ ను తప్పించారు. అలాగే రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ గా సంజూ శాంసన్ కు బాధ్యతలు అప్పగించారు.












Click it and Unblock the Notifications