నేనేమీ మిషన్ నో, రోబోనో కాను కదా: సంజు శాంసన్ ఘాటు రిప్లై
ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో మంగళవారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ ను 2-0 తేడాతో గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘన్ నిర్ణీత 20 ఓవర్లల్లో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం ఈ స్కోర్ ను టీమిండియా ఊదిపడేసింది. 14.5 ఓవర్లల్లో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 163 పరుగులతో విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్ లో ఓపెనర్ సంజు శాంసన్ విధ్వంసకర ఇన్నింగ్ ఆడాడు. విమర్శకుల నోళ్లు మూయించాడు. 22 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 57 పరుగులు రాబట్టాడు. టీమిండియాను ఘనవిజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. మొదటి మ్యాచ్ లో 10 పరుగులకే అవుట్ కావడం వల్ల అతనిపై విమర్శల జడివాన కురిసిన విషయం తెలిసిందే. తుదిజట్టులో అతన్ని తీసుకోకూడదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. వాటన్నింటికీ ఈ ఇన్నింగ్ తో తెరదించాడీ వికెట్ కీపర్ బ్యాటర్.

మ్యాచ్ అనంతరం తను ఎదుర్కొంటున్న విమర్శలు, సోషల్ మీడియా ట్రోల్స్, జట్టులో యువ ఆటగాళ్లు వస్తున్న తరుణంలో చోటు చేసుకుంటున్న కాంపిటిషన్ పై సంజూ శాంసన్ మాట్లాడాడు. బయట వినిపించే మాటలు తనను కలవరపెడతాయని, అనుభవంతో వాటిని తట్టుకోవడం నేర్చుకున్నానని చెప్పాడు. సోషల్ మీడియాకు గానీ, బయటి ప్రపంచానికి గానీ దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తానని, దీనికోసం వైఫై ఆఫ్ చేసుకుంటానని సరదాగా వ్యాఖ్యానించాడు.
అప్పుడప్పుడు వైఫై ఆన్ అయినప్పుడు కొన్ని కామెంట్లు తన కంట పడుతుంటాయని, వాటిని చూసి బాధపడకుండా ఉండటానికి తానేమీ మిషన్ నో, రోబోనో కానని వ్యాఖ్యానించాడు. ఆ కామెంట్లు.. తన ఆటతీరును కూడా ప్రభావితం చేస్తుంటుందని పేర్కొన్నాడు. అలా బాధపడ్డ ప్రతీసారీ నాతో నేనే మాట్లాడుకుంటూ, శక్తిసామర్థ్యాలేమిటో గుర్తుచేసుకుంటానని సంజూ వివరించాడు. ఒత్తిడిని అధిగమించడానికి మానసిక స్థితిని స్పష్టంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పాడు.
ఆటపై దృష్టి పెట్టకుండా విమర్శల గురించి ఆలోచిస్తే స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడం ఎంతమాత్రం సాధ్యం కాదని అన్నాడు. ప్రతి బంతిని బాదే ముందు పదిసార్లు ఆలోచించాల్సి వచ్చేదని, ఈ మ్యాచ్ లో కూడా సహజ శైలిలోనే ఆటపై మాత్రమే దృష్టి సారించి ఆడానని వివరించాడు. టీమిండియాలో పోటీ తీవ్రంగా ఉందనే విషయాన్ని సంజూ అంగీకరించాడు. వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి.. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం సహజమని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కేప్టెన్ గా వ్యవహరించిన అనుభవంతోనే జట్టు యాజమాన్యం తీసుకునే కొన్ని కఠిన నిర్ణయాలను అర్థం చేసుకోగలుగుతున్నానని సంజు శాంసన్ తెలిపాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనతో సంప్రదింపులు జరిపాడని వెల్లడించాడు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కఠిన నిర్ణయాలు తీసుకోవడాన్ని సమర్థిస్తానని చెప్పుకొచ్చాడు.













Click it and Unblock the Notifications
