విజయ్కి లండన్ పోలీసులు షాక్. క్రేజ్ చూసి సెక్యూరిటీ ఇవ్వలేక హ్యాండ్స్ అప్
తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ ప్రముఖుడు విజయ్ క్రేజ్ సరిహద్దులు దాటి లండన్ వీధుల్లోనూ సంచలనం సృష్టించింది. ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న ఆయనను ఒకనజరు చూసేందుకు వేలాది మంది అభిమానులు, ఎన్ఆర్‌ఐలు లండన్‌లోని ప్రసిద్ధ 'ది షార్డ్' భవనం వద్దకు భారీగా తరలివచ్చారు. అయితే, ఊహించని విధంగా భారీగా జనం తరలిరావడం, అక్కడ తొక్కిసలాట లాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా బ్రిటన్ పోలీసులు ఈ సభకు అనుమతి నిరాకరించారు. దీంతో గంటల తరబడి నిరీక్షించిన అభిమానులు తీవ్ర నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది.
గంటల కొద్దీ నిరీక్షణ.. చివరకు నిరాశే!
యుకేలోనే అత్యంత ఎత్తైన భవనంగా పేరుగాంచిన 'ది షార్డ్' సమీపంలో ముఖ్యమంత్రి విజయ్ తమను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలియడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. లండన్ నలుమూలల నుంచే కాకుండా బ్రిటన్‌లోని ఇతర ప్రాంతాల నుంచి కూడా జనం పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. అయితే భద్రతా ముప్పు పొంచి ఉందన్న లండన్ పోలీసుల హెచ్చరికలతో, విజయ్ బృందం మైక్ ద్వారా కార్యక్రమం రద్దయినట్లు అధికారికంగా ప్రకటించింది. "భద్రతకే మా మొదటి ప్రాధాన్యత, సరైన అనుమతులు లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదు" అని నిర్వాహకులు అభిమానులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

తమిళనాడు సభలను తలపించిన లండన్ వీధులు
లండన్ వీధుల్లో ఒక ఇండియన్ నాయకుడి కోసం ఈ స్థాయిలో జనం రావడం పట్ల అక్కడి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "మేము ఉదయం నుంచే ఆయన కోసం వేచి చూస్తున్నాం. సాధారణంగా తమిళనాడులో చూసే భారీ జనసందోహం ఇక్కడ లండన్ మధ్యలో కనిపించడం నమ్మలేకపోతున్నాం" అని వేడుక రద్దయిన తర్వాత ఒక అభిమాని తన ఆవేదనను వ్యక్తం చేశాడు. అభిమానుల కోలాహలంతో ఆ ప్రాంతమంతా తమిళనాడులోని పండుగ వాతావరణాన్ని తలపించింది.
రాష్ట్రం కోసం రూ. 12,300 కోట్లకు పైగా పెట్టుబడులు
తమిళనాడుకు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం బ్రిటన్ పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో తయారీ, సాంకేతిక రంగాలను మరింత బలోపేతం చేయడానికి పలు దిగ్గజ విదేశీ కంపెనీలతో విజయ్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఈ పర్యటన ద్వారా దాదాపు రూ. 12,300 కోట్ల మేర పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని, దీనివల్ల 9,400 మందికి పైగా యువతకు ఉన్నత స్థాయి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
ముగియనున్న బ్రిటన్ టూర్
లండన్ లో తన పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి విజయ్ బుధవారం తిరిగి భారత్‌కు పయనం కానున్నారు. పెట్టుబడుల సాధనలో విశేష విజయం సాధించినప్పటికీ, చివరి రోజున అభిమానులను నేరుగా కలిసి మాట్లాడే అవకాశం లభించకపోవడం కొద్దిపాటి అసంతృప్తిని మిగిల్చింది. అయినప్పటికీ, విదేశీ గడ్డపై విజయ్ కి లభించిన ఈ ఆదరణ ఆయన రాజకీయ ప్రయాణంలో మరో మైలురాయిగా నిలిచింది.














Click it and Unblock the Notifications
