icc world cup 2023: పాకిస్తాన్ సెమీస్ చేరకపోతే కెప్టెన్సీకి బాబర్ ఆజం గుడ్ బై? నేడు తాడోపేడో!
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లీగ్ లో భారీ అంచనాలతో అడుగుపెట్టిన పాకిస్తాన్ జట్టు స్ధాయికి తగ్గ ప్రదర్శన చూపడంలో విఫలమైంది. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న బౌలర్లు దాదాపు ప్రతీ మ్యాచ్ లోనూ నిరాశపరుస్తున్నారు. బ్యాటింగ్ విభాగం కాస్త కుదురుకున్నట్లు కనిపిస్తున్నా బౌలర్ల నుంచి సహకారం లేకపోవడంతో భారీ స్కోర్లు సాధించిన మ్యాచ్ లలోనూ ఓటమి తప్పడం లేదు. ఈ ప్రభావం అంతా కెప్టెన్ బాబర్ ఆజంపై పడుతోంది.
వరల్డ్ కప్ లో పాకిస్తాన్ వరుస వైఫల్యాలు సెమీ ఫైనల్ బెర్తుకే ఎసరు పెట్టాయి. ఇవాళ ఇంగ్లండ్ తో చివరి లీగ్ మ్యాచ్ కు సిద్ధమవుతున్న పాకిస్తాన్ కు చావోరేవో అన్న పరిస్ధితి ఎదురవుతోంది. అద్భుతం జరిగితే తప్ప ఇంగ్లండ్ పై గెలిచినా సెమీస్ కు అడుగుపెట్టలేని పరిస్ధితుల్లో ఉన్న దాయాది జట్టుపై ఇప్పుడు ఇంటా బయటా విమర్శల జడివాన కురుస్తోంది. స్వయంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు వసీం అక్రమ్, ఇతరులు బాబర్ ఆజం సేనపై సెటైర్లపై సెటైర్లు వేస్తున్నారు. దీంతో వారిని సమాధాన పరచడం బాబర్ కు సాధ్యం కావడం లేదు.

ఇప్పటికే టోర్నీలో 8 మ్యాచ్ లు ఆడి కేవలం నాలుగు మ్యాచ్ లు గెలిచి 8 పాయింట్లతో ఉన్న పాకిస్తాన్ కు ఇవాళ ఇంగ్లండ్ తో ఆడే మ్యాచ్ లో గెలిచినా వచ్చేది 10 పాయింట్లు మాత్రమే. ఇప్పటికే న్యూజీలాండ్ 10 పాయింట్లతో పాటు పాకిస్తాన్ కంటే మెరుగైన రన్ రేట్ కలిగి సెమీస్ కు దాదాపు అర్హత సాధించేసింది. ఇక ఇంగ్లండ్ తో మ్యాచ్ లో పాకిస్తాన్ 287 పరుగుల తేడాతో ఆ జట్టును ఓడిస్తే తప్ప సెమీస్ కు చేరడం అసాధ్యమే. ఇలాంటి పరిస్ధితుల్లో పాక్ ఇంటికెళ్లడం ఖాయమనే చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఓవైపు వరుస ఓటములు, మరోవైపు ఇంటా, బయటా విమర్శలతో సతమతం అవుతున్న బాబర్ ఆజం తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేయాలనే నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. తీవ్ర ఒత్తిడి మధ్య బ్యాటింగ్ లోనూ వరుసగా విఫలం అవుతున్న బాబర్ ఇవాళ్టి మ్యాచ్ తర్వాత కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేస్తాడని సమాచారం. ఇవాళ మ్యాచ్ లో అద్భుతం జరిగి పాకిస్తాన్ సెమీస్ కు చేరితే తప్ప బాబర్ కెప్టెన్సీ వదులుకోవడ ఖాయమనే ప్రచారం సాగుతోంది. అయితే నిన్న మాత్రం బాబర్ భారత్ తో సెమీస్ పోరుపై ఇంకా ఆశాభావంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.












Click it and Unblock the Notifications