రేపు ఇంగ్లండ్ తో కీలక పోరు-షమీ, అశ్విన్ మధ్య ఇండియా డైలమా...!
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ ప్రపంచకప్ లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ఏ జట్టుకూ సాధ్యం కాని రీతిలో వరల్డ్ కప్ లో అజేయంగా నిలిచిన రోహిత్ సేన.. ఇప్పుడు మరో విజయంతో సెమీ పైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ సమయంలో వరుస ఓటములతో సతమతం అవుతున్న ఇంగ్లండ్ తో రేపు లక్నోలో జరిగే లీగ్ మ్యాచ్ కు సిద్ధమవుతోంది. అయితే ఈ మ్యాచ్ లో బౌలింగ్ కాంబినేషన్ పై టీమిండియా మల్లగుల్లాలు పడుతోంది.
స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా గాయంతో దూరం కావడంతో టీమిండియా బౌలింగ్ విభాగంలో మార్పులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో బ్యాటర్లకు అనుకూలించే లక్నో ఎకానా స్టేడియంలో ఇంగ్లండ్ పై బౌలింగ్ కాంబినేషన్ పై జట్టు మేనేజ్ మెంట్ పలు ఆప్షన్లు పరిశీలిస్తోంది. ఇందులో ఈ మధ్యే జట్టులోకి వచ్చిన పేసర్ మొహమ్మద్ షమీ సత్తా చాటుకోవడంతో ఇప్పుడు స్పిన్నర్ అశ్విన్ ను తీసుకోవాలా లేక షమీని ఆడించాలా అన్న అంశంపై టీమిండియా చర్చిస్తోంది.

హార్ధిక్ పాండ్యా జట్టులో ఉండగా ఆరో స్ధానంలో బ్యాటింగ్ కు రావడంతో పాటు మూడో పేసర్ గా కూడా అందుబాటులో ఉండేవాడు. దీంతో రోహిత్ సేనకు ఆరుగురు బౌలర్లు అందుబాటులో ఉండేవారు. కానీ ఇప్పుడు పాండ్యా గైర్హాజరీలో భారత్ ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగుతోంది. ఇందులోనూ జడేజా, కుల్దీప్ యాదవ్ జోడీని కదిపే పరిస్ధితి లేదు. అలాగే బుమ్రా, సిరాజ్ జోడీనీ కదిపే పరిస్దితి లేదు. కాబట్టి ఐదో బౌలర్ గా ఎవరిని తీసుకోవాలనే దానిపై డైలమా నెలకొంది.
ధర్మశాలలో న్యూజీలాండ్ తో జరిగిన మ్యాచ్ లో జట్టులోకి వచ్చిన షమీ ఐదు వికెట్లు తీసి నిరూపించుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ స్ధానంలో జట్టులోకి వచ్చిన షమీని కొనసాగించాలనే ఒత్తిడి టీమిండియాపై విపరీతంగా ఉంది. అదే సమయంలో స్పిన్నర్లకు అనుకూలించే ఎకోనా స్టేడియం పిచ్ పై మూడో స్పిన్నర్ అశ్విన్ ను తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. దీంతో టీమిండియాకు వీరిద్దరిలో ఎవరిని ఎంచుకోవాలన్న దానిపై గందరగోళం నెలకొంది. అయితే రేపు పిచ్ చూసాక వీరిద్దరిలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications