టీమిండియా 22/3- సేమ్ ఓల్డ్ స్టోరీ..
Virat Kohli: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లోని ప్రతిష్ఠాత్మక గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తడబడుతోంది. ఇన్నింగ్ ఆరంభంలోనే మూడు వికెట్లను కోల్పోయింది. భోజన విరామ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాపై 423 పరుగులు వెనుకంజలో ఉంది.
తొలి ఇన్నింగ్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ అయింది. ట్రావిస్ హెడ్- 152, స్టీవెన్ స్మిత్- 101 పరుగులతో సత్తా చాటారు. లోయర్ ఆర్డర్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ 70 పరుగులు చేశాడు. ఈ ముగ్గురు తప్ప మిగిలిన బ్యాటర్లెవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు.

టీమిండియా బౌలర్లల్లో రాణించింది జస్‌ప్రీత్ బుమ్రా ఒక్కడే. ఆరు వికెట్లు అతని ఖాతాలో పడ్డాయి. బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో తన రోల్ ఎలాంటిదో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడీ ఏస్ బౌలర్. మహ్మద్ సిరాజ్- 2 వికెట్లు కూల్చాడు. ఆకాశ్ దీప్, పార్ట్ టైమ్ బౌలర్ నితీష్ కుమార్ రెడ్డి ఒక్కో వికెట్ పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను ప్రారంభ ఓవర్లలోనే దెబ్బకొట్టారు ఆస్ట్రేలియా బౌలర్లు. తొలి ఓవర్ రెండో బంతికే యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. మిఛెల్ స్టార్క్ సంధించిన ఓవర్ అది. మిడిల్ స్టంప్ మీద స్టార్ డెలివరీని స్క్వేర్ లెగ్ దిశగా ఫ్లిక్ చేశాడు జైస్వాల్. నేరుగా వెళ్లి అక్కడే కాచుకుని ఉన్న మార్ష్ చేతిలో వాలిందా బంతి. ఓ సాఫ్ట్ డిస్మిసల్ అది. దీనితో నాలుగు పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది భారత్.
మూడో ఓవర్ తొలి బంతికీ ఇంకో వికెట్ పడింది. స్టార్క్ బౌలింగ్ ధాటికి ఈ సారి వన్ డౌన్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ బలి అయ్యాడు. ఆఫ్ స్టంప్‌కు కాస్త దూరంగా వేసిన ఫుల్ బాల్‌ను గిల్ డ్రైవ్ చేయబోయాడు. ఎడ్జ్ తీసుకున్న బంతిని గల్లీలో ఉన్న మార్ష్ అద్భుతంగా అందుకున్నాడు. దాదాపుగా తనను దాటి వెళ్లిన బంతిని ఎడమ వైపు గాల్లోకి ఎగిరి మరీ ఒడిసి పట్టాడు. ఆరు పరుగులకు రెండో వికెట్.
వికెట్ల పతనానికి అక్కడితో బ్రేకులు పడలేదు గానీ కొంచెం గ్యాప్ వచ్చిందంతే. భోజన విరామానికి ముందు ఓవర్‌లో విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. ఈ సారి జోష్ హేజిల్‌వుడ్ వంతు. వదిలేస్తే పోయే బంతికి అనవసరంగా షాట్ ఆడటానికి ప్రయత్నించాడు కోహ్లీ.
ఆఫ్ స్టంప్‌కు కాస్త దూరంగా పిచ్ అయి లేచిన బంతిని డ్రైవ్ చేయబోయాడు కోహ్లీ. టైమింగ్ మిస్ అయ్యాడు. థిన్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా వెళ్లి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతిలో పడింది. ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్లే డెలివరీలను ఆడి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం తనకు కొత్తేమీ కాదని కోహ్లీ మరోసారి నిరూపించుకున్నట్టయింది. 22 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది భారత్.












Click it and Unblock the Notifications