భారత్.. ఘన విజయం: ఫైనల్స్‌లో
IND vs ENG: టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్ దండయాత్ర సాగుతోంది. రెండో సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. ఫైనల్స్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తుదిపోరులో దక్షిణాఫ్రికాను ఢీ కొట్టబోతోంది టీమిండియా. ఈ మ్యాచ్.. శనివారం సాయంత్రం 8 గంటలకు ఈ మ్యాచ్ జరుగనుంది. బార్బడొస్ రాజధాని బ్రిడ్జిటౌన్ దీనికి వేదిక.
గుయానాలో తాజాగా జరిగిన రెండో సెమీ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది భారత్. 68 పరుగుల తేడాతో జయకేతనాన్ని ఎగురవేసింది. ఓటమి ఎరుగని గెలుపు. ఒకరకంగా ఇది ప్రతీకార విజయం కూడా. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని డిపార్ట్‌మెంట్‌లల్లో టీమిండియా ప్లేయర్లు వారియర్స్‌ను గుర్తుకు తెచ్చారు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ కేప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. అతనే టాప్ స్కోరర్ కూడా. 39 బంతుల్లో రెండు భారీ సిక్సర్లు, ఆరు ఫోర్లతో 57 పరుగులు చేశాడు.
టాప్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్- 47 దూకుడుగా ఆడాడు. మూడో వికెట్ భాగస్వామ్యానికి 73 పరుగులు జోడించారు. టీమిండియా భారీ స్కోర్ సాధించడానికి అదే పునాది. హార్దిక్ పాండ్యా- 23, రవీంద్ర జడేజా- 17, అక్షర్ పటేల్- 10, విరాట్ కోహ్లీ- 9, రిషభ్ పంత్- 4 పరుగులు చేశారు.
అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఇంగ్లాండ్.. బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ప్రత్యేకించి స్పిన్ బౌలింగ్‌కు వికెట్లను సమర్పించుకున్నారు. 16.4 ఓవర్లల్లో 103 పరుగులకు కుప్పకూలింది. 25 పరుగులు చేసిన మిడిలార్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఒక్కడే టాప్ స్కోరర్. కేప్టెన్ జోస్ బట్లర్- 23, జోఫ్రా ఆర్చర్- 21, లియామ్ లివింగ్‌స్టొన్- 11 మినహా మిగిలిన వారెవరూ పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు.
స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్.. చెలరేగారీ మ్యాచ్‌లో. వర్షం పడ్డ తరువాత పిచ్ స్పిన్ బౌలింగ్‌కు అనుకూలించడాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మూడు చొప్పున వికెట్లను పంచుకున్నారు. జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. తమ నాలుగు ఓవర్ల కోటాలో అక్షర్ పటేల్ 23 పరుగులకు 3, కుల్‌దీప్ యాదవ్ 19 పరుగులకు 3 వికెట్లు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications