U-19 World Cup Winner: చరిత్ర సృష్టించిన భారత్-ఆరోసారి అండర్ 19 వరల్డ్ కప్..!
worఅండర్ 19 వరల్డ్ కప్ (u-19 world cup) లో కుర్రాళ్లతో కూడిన యంగ్ ఇండియా అద్భుతమే చేసింది. ఆరోసారి వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఇవాళ ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి 411 పరుగులు భారీ స్కోరు సాధించిన యంగ్ ఇండియా విజయానికి బాటలు వేసుకుంది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో తడబడిన ఇంగ్లాండ్ చివరికి 311 పరుగుల వద్ద చాపచుట్టేసింది.
జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ లో ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు అంతగొప్ప ఆరంభం లభించలేదు. సెమీస్ సెంచరీ హీరో ఆరోన్ జార్జ్ 9 పరుగులకే అవుటయ్యారు. దీంతో మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ ఆయుష్ మాత్రేతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ సిక్సర్లు, ఫోర్ల మోత మోగించాడు. మరోవైపు మాత్రే నుంచి కూడా చక్కటి సహకారం లభించడంతో ఆర్ధసెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్ దూకుడు కొనసాగించాడు. ఆ తర్వాత మాత్రే అవుటైనా, ఆ తర్వాత వేదాంత్, విహాన్, అభిజ్ఞాన్ నుంచి సహకారం లభించింది. మరోవైపు వేగంగా ఆడిన వైభవ్.. ఇదే ఊపులో సెంచరీ కూడా దాటాడు. ఆ తర్వాత కూడా దూకుడు కొనసాగించిన వైభవ్ 175 పరుగులు చేసి అవుటయ్యారు. చివర్లో టెయిలెండర్లు కూడా పర్వాలేదనిపించడంతో భారత్ 9 వికెట్లకు 411 పరుగులు చేసింది.

అనంతరం 412 పరుగుల భారీ లక్ష్య ఛేదన ప్రారంభించిన ఇంగ్లాండ్ 19 పరుగులకే మూర్స్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత మేయెస్, ఫాల్కనర్ జోడీ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత 45 పరుగులు చేసిన మేయెస్ కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత ఆల్బర్బ్, ఫర్హాన్, మోర్గాన్ కూడా తక్కువ స్కోరర్లకే అవుటయ్యారు. దీంతో ఇంగ్లండ్ 177 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అయితే మరోవైపు ఫాల్కనర్ మాత్రం భారీ షాట్లు కొడుతూ భారత బౌలర్లను ముప్పతిప్పలు పెట్టాడు. మరో ఎండ్ లో అతనికి సహకారం లభించకపోయినా వికెట్ కాపాడుకుంటూ సెంచరీ పూర్తి చేశాడు. చివరికి 115 పరుగులు చేసిన ఫాల్క్ నర్ అవుట్ తో ఇంగ్లాండ్ 311 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 100 పరుగుల తేడాతో విజయం సాధించింది.













Click it and Unblock the Notifications