IND vs PAK: దేశవ్యాప్తంగా ఇండియా-పాక్ మ్యాచ్ ఫీవర్ ! ఈసారి సెంచరీలపై భారీ బెట్టింగ్ లు !
ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఎల్లుండి గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో ఇండియా-పాకిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ అంతా ఓ ఎత్తు.. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఓ ఎత్తు అన్నట్లుగా పరిస్ధితి మారిపోయింది. దేశవ్యాప్తంగా ఈ మ్యాచ్ పై క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మ్యాచ్ లో భారత్ ఫేవరెట్ గానే బరిలోకి దిగుతున్నా, శ్రీలంకపై పాకిస్తాన్ సాధించిన విజయంతో ఈ మ్యాచ్ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
ఎల్లుండి శనివారం ఇండియా-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే కీలక వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ ను ఇరుజట్లూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ మ్యాచ్ కు ముందు ఇరుజట్లూ ఆడిన మ్యాచ్ లూ, ఆ తర్వాత ఆడబోయే మ్యాచ్ ల కంటే ఇండియా-పాక్ మ్యాచ్ పైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. దీనికి కారణం ఇందులో గెలుపు ఇరుజట్లకూ అంత కీలకంగా మారడమే. గతంలో వరల్డ్ కప్ అంటే పాకిస్తాన్ పై భారత్ మ్యాచ్ గెలుపు లాంఛనమే అన్నట్లుగా ఉండేది. కానీ మారిన పరిస్దితుల్లో ఇరు జట్లూ పోటాపోటీగా తలపడుతుండటంతో అంచనాలు కూడా అంతకంత పెరిగిపోతున్నాయి.

ఈసారి వరల్డ్ కప్ లో బ్యాట్స్ మెన్ సెంచరీల మోత మోగిస్తున్నారు. దాదాపు ప్రతీ జట్టులోనూ ఎంతో కొంత మంది బ్యాట్స్ మెన్ సెంచరీలు చేస్తూనే ఉన్నారు. శ్రీలంకతో దక్షిణాఫ్రికా మ్యాచ్ లో ఏకంగా ఓ ఇన్నింగ్స్ లోనే మూడు సెంచరీలు నమోదయ్యాయి. తాజాగా పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్ లోనూ ఇరువైపులా రెండేసి సెంచరీలు నమోదయ్యాయి. ఫలితంతో సంబంధం లేకుండా సెంచరీల మోత మోగుతుండటంతో భారత్-పాక్ మ్యాచ్ లోనూ సెంచరీలపై ఉత్కంఠ పెరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఎంతమంది బ్యాట్స్ మెన్ సెంచరీలు చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
భారత్-పాక్ మ్యాచ్ అంటేనే దేశంలో బెట్టింగ్ రాయుళ్లకు పండగ. మన దేశంలోనే కాదు విదేశాల్లో సైతం భారీగా బెట్టింగ్ లు వేస్తుంటారు. ఈసారి కూడా భారత్-పాక్ మ్యాచ్ పై భారీ ఎత్తున బెట్టింగ్ సాగుతున్నట్లు సమాచారం. అందులోనే మ్యాచ్ ఫలితంతో పాటు సెంచరీలపై ఎక్కువగా బెట్టింగ్ సాగుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ల్లో నిలకడగా రాణించిన విరాట్ కొహ్లీ ఈసారి కూడా సెంచరీ సాధిస్తాడనే అంచనాలున్నాయి. అలాగే ఫామ్ లో ఉన్న రోహిత్, శ్రేయస్ వంటివారు కూడా సెంచరీలు కొడతారనే అంచనాలున్నాయి. అటు పాకిస్తాన్ లోనూ కెప్టెన్ బాబర్, తాజాగా లంకపై సెంచరీలు బాదిన రిజ్వాన్, షఫీక్ వంటి వారిపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications