IND-NZ ODI: టీమిండియా ఎంపికలో భారీ ట్విస్ట్ లు..! షమీ ఇన్-మరోషాక్..!
భారత్-న్యూజీలాండ్ జట్ల మధ్య ఈ నెల 11 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. వడోదరలో 11న జరిగే తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో వన్డేలకు జట్టు ఎంపిక బీసీసీఐకి సవాల్ గా మారింది. అయితే ఇప్పటికే బీసీసీఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి వన్డే జట్టులో ఊహించని సర్ ప్రైజ్ లు ఉంటాయని తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ విషయంలో గిల్ విషయంలో షాకులిచ్చిన సెలెక్టర్లు ఇప్పుడు వన్డే జట్టు ఎంపికలోనూ అదే బాటలో ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ విజయ్ హజారే ట్రోఫీలో ఆటగాళ్ల ఫామ్, ఫిట్ నెస్ ల ఆధారంగా న్యూజీలాండ్ తో వన్డే సిరీస్ కు జట్టును ఎంపిక చేయాలని భావిస్తున్నా.. ఇప్పటికే ఉన్న సమీకరణాల ఆధారంగా దాదాపు టీమ్ సిద్దంగానే ఉంది. అయితే ఇందులో జరిగే ఒకట్రెండు మార్పులే సంచలనాలకు దారి తీసే అవకాశం ఉంది. ఇందులో విజయ్ హజారే ట్రోఫీలో ఫెయిల్ అవుతున్న వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ ను జట్టు నుంచి తప్పించే అవకాశాలున్నాయి. అలాగే ఈ మధ్య జట్టుకు దూరమైన పేసర్ మొహమ్మద్ షమీకి రీఎంట్రీ లభించడం ఖాయంగా కనిపిస్తోంది.

గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు దక్షిణాఫ్రికాతో వన్డేలకూ ఎంపిక చేసిన పంత్ కు ఒక్క మ్యాచ్ లోనూ ఆడే ఛాన్స్ దొరకలేదు. దానికి తోడు విజయ్ హజారే ట్రోఫీలో వైఫల్యాలు అతనిపై వేటుకు కారణమయ్యేలా ఉన్నాయి. కాబట్టి అతని స్ధానంలో కీపర్ గా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ పోటీలో ఉన్నారు. విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ చేసిన ధ్రువ్ జురెల్ కూడా పోటీలో ఉన్నాడు. అలాగే బ్యాటింగ్ ఆర్డర్ లో దేవదత్ పడిక్కల్ కు కూడా ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అయితే గిల్ తిరిగి రావడం, రోహిత్-కొహ్లీ జోడీకు తోడు యశస్వీ జైశ్వాల్ అందుబాటులో ఉండటంతో టాప్ ఆర్డర్ ఫుల్ గా కనిపిస్తోంది. దీంతో రుతురాజ్ గైక్వాడ్ ను కూడా జట్టులో తీసుకోవడం కష్టంగానే మారింది.

బౌలింగ్ కాంబినేషన్ కు వస్తే.. టీ20 ప్రపంచకప్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని పేసర్ జస్ ప్రీత్ బుమ్రాతో పాటు ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్ మరోసారి పోటీలో ఉన్నారు. వీరితో పాటు మొహమ్మద్ షమీని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ మరియు కుల్దీప్ యాదవ్‌లతో స్పిన్ విభాగం పటిష్టంగా ఉంది. దీన్ని మార్చకపోవచ్చు.












Click it and Unblock the Notifications