మొహసిన్ నఖ్వీకి బిగ్ షాక్: విమెన్స్ టీమిండియా తగ్గేదే లేదు: ఆసియా కప్ అందుకోవడానికి నిరాకరణ

దుబాయ్‌లో మహిళల ఆసియా కప్ ఫైనల్ లో భారత జట్టు ఘన విజయం సాధించింది. శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం సాధించిన ఆనందంలో ఉన్న భారత జట్టుకు ప్రెజెంటేషన్ సెరెమనీలో ఒక అనూహ్య పరిస్థితి ఎదురైంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ గా వ్యవహరిస్తోన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్, మంత్రి మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడానికి జట్టు నిరాకరించింది.

దీంతో నఖ్వీ వెనక్కి తగ్గారు. రన్నరప్‌గా నిలిచిన శ్రీలంక జట్టు కేప్టెన్ చమారి ఆటపట్టుకు రన్నరప్ చెక్కును అందజేసి ప్రెజెంటేషన్ వేదిక నుంచి ఆయన వెళ్లిపోయారు. దీంతో ఆసియా కప్ ట్రోఫీని భారత జట్టు చేతికి అందలేదు. దీనిపై భారత జట్టు హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ స్పందించారు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కప్ చేతికి అందినా, అందకపోయినా ఛాంపియన్‌గా నిలవడమే తమకు ముఖ్యమని వ్యాఖ్యానించారు.

India Women Refuse to Receive Asia Cup Trophy From Mohsin Naqvi After 72 Run Final Win vs Sri Lanka

ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టత ఇచ్చారు. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత్ మొదటి నుంచే వ్యతిరేకిస్తూ వచ్చామని అన్నారు. అయినప్పటికీ ఈ సమస్య పరిష్కారానికి నఖ్వీకి రెండు ప్రత్యామ్నాయాలు సూచించినట్లు పేర్కొన్నారు. ఏసీసీ వైస్ ఛైర్మన్ ఖలీద్ అల్ జరూని లేదా కప్ గెలిచిన దేశానికి చెందిన క్రికెట్ బోర్డు ప్రతినిధి స్వయంగా ట్రోఫీని బహూకరించాలనే ప్రతిపాదనలు ఉంచామని, వీటిని నఖ్వీ తిరస్కరించినట్లు పేర్కొన్నారు.

ట్రోఫీని తానే స్వయంగా అందిస్తానని నఖ్వీ పట్టుబట్టగా, దానికి భారత జట్టు ససేమిరా అంది. మ్యాచ్ చివరి దశకు చేరుకున్న సమయంలో నఖ్వీ స్టేడియానికి వచ్చారు. వీఐపీ గ్యాలరీలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, దేవజిత్ సైకియా పక్కనే కూర్చుని కనిపించారు. భారత్- పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. మొహసిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకూడదని బీసీసీఐ గతంలోనే సూచనప్రాయంగా తెలిపింది కూడా.

భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా క్రికెట్ లో ఇలాంటి వివాదం తలెత్తడం ఇది మొదటిసారేమీ కాదు. గత ఏడాది సెప్టెంబర్ లో పురుషుల ఆసియా కప్ ఫైనల్‌లోనూ పాకిస్తాన్ గెలిచిన అనంతరం నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడానికి టీమిండియా నిరాకరించింది. అప్పట్లో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ ద్వారా ట్రోఫీని అందజేయాల్సిందిగా భారత్ కోరినప్పటికీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ దీనికి అంగీకరించలేదు. తాజాగా మహిళల జట్టులో కూడా అదే విధమైన ప్రతిష్టంభన ఏర్పడడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ ఫైనల్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లల్లో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన- 59, ఫఫాలి వర్మ- 68 పరుగులతో భారీ ఇన్నింగ్ కు పునాది వేశారు. హర్మన్ ప్రీత్ కౌర్- 14, రిచా ఘోష్- 17, దీప్తి శర్మ- 5 నిరాశపరిచినప్పటికీ.. జట్టు భారీ స్కోరే చేసింది. అనంతరం శ్రీలంక 111 పరుగులకే ఆలౌట్ అయింది. చమారి ఆటపట్టు- 36, నీలాక్షిక సిల్వ- 22, వైష్మీ గుణరత్నె- 20 పరుగులతో ఫర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లెవరూ రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+