Sydney Test: సిడ్నీలో 181కే కంగారూల ఆలౌట్-వణికించిన భారత పేసర్లు ..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్టులో రెండో రోజు సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిన్న తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 9 పరుగులతో ఉన్న ఆస్ట్రేలియా ఇవాళ ఉదయం భారత పేసర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది.
ముఖ్యంగా బుమ్రా ఇచ్చిన ఆరంభాన్ని అందుకుంటూ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నితీష్ రెడ్డి చెలరేగడంతో ఆసీస్ 181 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో చాప చుట్టేసింది.

నిన్న సిడ్నీ టెస్టు తొలి రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకు భారత్ ఆలౌటైంది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ కు చివరి ఓవర్లో పేసర్ బుమ్రా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను అవుట్ చేసి షాకిచ్చాడు. దీంతో వికెట్ నష్టానికి 9 పరుగులతో తొలి రోజు ఆట ముగించిన ఆసీస్ .. రెండో రోజు ఆటను కూడా పాజిటివ్ గా ప్రారంభించలేకపోయింది. 15 పరుగులకే లబుషేన్ ను బుమ్రా వికెట్ కీపర్ క్యాచ్ తో అవుట్ చేశాడు. అనంతరం 35 పరుగుల వద్ద మరో ఓపెనర్ శామ్ కోన్ స్టాస్ ను సిరాజ్ అవుట్ చేశాడు. ఫామ్ లో ఉన్న ట్రావిస్ హెడ్ కూడా 4 పరుగులకే అవుట్ కావడంతో ఆసీస్ 39కే 4 వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత స్టీవ్ స్మిత్-బ్యూ వెబ్ స్టర్ జోడీ ఆసీస్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దేందుకు ప్రయత్నించినా భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. బుమ్రా గాయంతో మైదానాన్ని వీడటంతో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నితీష్ రెడ్డి కంగారూలకు మెరుపు బంతులతో చుక్కలు చూపించారు. 33 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ ను వెనక్కి పంపిన ప్రసిద్ధ్ కృష్ణ.. ఆ తర్వాత వచ్చిన అలెక్స్ కేరీని సైతం అవుట్ చేశాడు. దీంతో 137 పరుగులకు ఆసీస్ 6 వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత కూడా ఆసీస్ పతనం కొనసాగింది. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ , మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ తక్కువ పరుగులకే అవుట్ కావడంతో ఆసీస్ 181 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ మూడేసి వికెట్లు తీయగా.. బుమ్రా, నితీష్ రెడ్డి రెండేసి వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించారు. ఆసీస్ బ్యాటర్లలో 57 పరుగులు చేసిన బ్యూ వెబ్ స్టర్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్మిత్ 33, కోన్ స్టాస్ 23, అలెక్స్ కేరీ 21 పరుగులు చేశారు.












Click it and Unblock the Notifications