IPL 2024: రోహిత్ కు భారీ షాక్ ! ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్ధిక్ పాండ్యా..
గతేడాది ఐపీఎల్ సీజన్ లో తొలిసారి కెప్టెన్సీ చేపట్టి గుజరాత్ ను ఫైనల్ వరకూ తీసుకెళ్లిన స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తాజాగా అనూహ్యంగా తన పాత జట్టు ముంబై ఇండియన్స్ కు తిరిగి వచ్చాడు. దీంతో గుజరాత్ కు కెప్టెన్ గా వ్యవహరించిన పాండ్యాకు ముంబై ఇండియన్స్ జట్టులో ఏ రోల్ దక్కబోతోందనే ఉత్కంఠ మొదలైంది. దీనికి ఇవాళ ముంబై ఇండియన్స్ జట్టు మేనేజ్ మెంట్ తెరదించింది. హార్ధిక్ పాండ్యాను వచ్చే సీజన్ కు కెప్టెన్ గా ఎంపిక చేసినట్లు ముంబై ఇండియన్స్ ప్రకటించింది.

ముంబై ఇండియన్స్ జట్టుకు విజయవంతమైన కెప్టెన్ గా రోహిత్ శర్మ పేరు తెచ్చుకున్నాడు. తాజాగా వన్డే ప్రపంచకప్ లోనూ టీమిండియాను ఫైనల్ కు చేర్చాడు. అయితే భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని కెప్టెన్సీ బాధ్యతల్ని రోహిత్ ను కాదని ఈసారి హార్ధిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించాలని ముంబై యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీమ్ మేనేజ్ మెంట్ ఇవాళ ప్రకటన విడుదల చేసింది.
ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ మహేల జయవర్ధనే దీనిపై స్పందిస్తూ.. ఇది లెగసీ బిల్డింగ్‌లో భాగమని తెలిపాడు. భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలనే ముంబై జట్టు యాజమాన్యం ఆలోచనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ముంబై ఇండియన్స్ ఎల్లప్పుడూ సచిన్ నుండి హర్భజన్ వరకు, రికీ నుండి రోహిత్ వరకు అసాధారణమైన నాయకత్వంతో పనిచేసిందని, వారు తక్షణ విజయానికి దోహదం చేస్తూనే భవిష్యత్తు కోసం జట్టును బలోపేతం చేయడంపై ఎప్పుడూ దృష్టి పెట్టారన్నాడు. దీనికి కొనసాగింపుగానే ఇప్పుడు హార్ధిక్ కు అవకాశం ఇస్తున్నట్లు తెలిపాడు.
అదే సమయంలో తన అసాధారణమైన నాయకత్వానికి రోహిత్ శర్మకు అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు.
2013 నుండి ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అతని పదవీకాలం అసాధారణమైనదని, అతని నాయకత్వం జట్టుకు అసమాన విజయాన్ని అందించడమే కాకుండా ఐపిఎల్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా అతని స్థానాన్ని పదిలం చేసిందన్నాడు. రోహిత్ మార్గదర్శకత్వంలో ముంబై అత్యంత విజయవంతమైన, అందరూ ఇష్టపడే జట్లలో ఒకటిగా మారిందన్నాడు.
ముంబై జట్టును మరింత బలోపేతం చేయడానికి మైదానంలో, వెలుపల రోహిత్ శర్మ మార్గదర్శకత్వం, అనుభవం కోసం తాము ఎదురుచూస్తున్నట్లు మహేళ వెల్లడించాడు. ముంబై కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను తాము స్వాగతిస్తున్నామని, అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని మహేళ తెలిపాడు. దీంతో ముంబై జట్టు యాజమాన్యం ఆలోచన ఏంటో అర్ధమవుతోంది.












Click it and Unblock the Notifications