ముంబై ఇండియన్స్‌కు ఆ ఛాన్స్ ఉందా?
GT vs MI: ఐపీఎల్ 2025లో ఇంకో కీలక మ్యాచ్ ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరు దాదాపుగా ఏకపక్షమైంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది ఆర్సీబీ. తొలుత బ్యాటింగ్, ఆ తరువాత బౌలింగ్‌లో దుమ్ము దులిపింది. సీఎస్‌కే కట్టడి చేసింది. 50 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది.
శుక్రవారం రాత్రి చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కేప్టెన్ రజత్ పటిదార్ టాప్ స్కోరర్. సారథిగా జట్టును ముందుండి నడిపించాడు. 32 బంతుల్లో మూడు భారీ సిక్సర్లు, నాలుగు ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఫిల్ సాల్ట్- 32, విరాట్ కోహ్లీ- 31, దేవదత్ పడిక్కల్- 27 పరుగులు చేశారు. చివర్లో టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్ ఆడాడు. సిక్సర్ల మోత మోగించాడు. ఎనిమిది బంతుల్లో మూడు బ్యాక్ అండ్ బ్యాక్ సిక్సర్లు బాదాడు. ఫలితంగా రాయల్ ఛాలెంజర్స్.. తన ప్రత్యర్థి ముందు భారీగా పరుగులు సమకూర్చిపెట్టగలిగింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. తడబడింది. విజయాన్ని అందుకోలేక చతికిలపడింది. 146 పరుగుల వద్దే ముగిసిందా జట్టు ఇన్నింగ్. 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 146 పరుగులే చేయగలిగింది. భారీ భాగస్వామ్యాలను నిర్మించలేకపోయారా జట్టు బ్యాటర్లు.
జట్టు స్కోర్ ఎనిమిది పరుగుల వద్ద ఉన్నప్పుడు రెండో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే ఏ దశలో కూడా కోలుకోలేకపోయింది. వరుసగా వికెట్లను కోల్పోయింది. వెటరన్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీ- రవీంద్ర జడేజా మధ్య ఏర్పడిన 31 పరుగుల భాగస్వామ్యమే అధికం అంటే ఆ జట్టు బ్యాటింగ్ ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ విజయంతో ఓ అరుదైన ఘనతను సాధించినట్టయింది ఆర్సీబీకి. చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించడానికి 17 సంవత్సరాలు పట్టింది. 2008 ఐపీఎల్ తొలి సీజన్‌లో చెపాక్‌లో సీఎస్‌కేను ఓడించింది బెంగళూరు. ఆ తరువాత ఇంకెప్పుడే గానీ విజయం అనేదే దక్కలేదు. దీనికి తాజాగా పుల్ స్టాప్ పెట్టింది.
అదే సమయంలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇప్పటివరకు ఆడిన రెండింట్లో రెండు విజయాలతో నాలుగు పాయింట్లను తన ఖాతాలో వేసుుకంది. 2.266 నెట్ రన్‌రేట్‌ను సాధించింది. తన తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొట్టబోతోంది. ఏప్రిల్ 2వ తేదీన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దీనికి వేదిక.
కాగా- ఇప్పటివరకు కూడా బోణీ కొట్టని జట్లు మూడు. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్.. అట్టడుగున నిలిచాయి పాయింట్ల పట్టికలో. ఈ మూడు జట్లు కూడా చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి మరీ ఘోరం. ఇప్పటివరకు ఆడిన రెండింట్లోనూ మట్టికరిచింది. 10 స్థానంలో ఉంది.
నేడు గుజరాత్ టైటాన్స్‌తో తలపడబోతోంది ముంబై ఇండియన్స్. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. అహ్మదాబాద్ దీనికి వేదిక. ఏ జట్టు గెలిచినా బోణీ కొట్టినట్టవుతుంది. మెజారిటీ అంచనాలు ముంబై ఇండియన్స్ వైపే ఉన్నాయి. దీనితో పోల్చుకుంటే గుజరాత్ టైటాన్స్ కాస్త బలహీనంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.












Click it and Unblock the Notifications