పాకిస్తాన్ కు భారత్ బిగ్ పంచ్- ఉక్కిరిబిక్కిరి: ఏకపక్షం
స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరుగుతోన్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ లో భారత బాక్సర్ జదుమణి సింగ్ అద్భుత విజయాన్ని సాధించాడు. ఆదివారం రాత్రి ఉత్కంఠభరితంగా జరిగిన పురుషుల 55 కిలోల కేటగిరీలో పంచ్ లో విరుచుకుపడ్డాడు. రౌండ్ ఆఫ్ 16లో తన చిరకాల ప్రత్యర్థి, పాకిస్తాన్‌కు చెందిన సుమామా రెహ్మాన్‌పై మట్టికరిపించాడు. ఈ బౌట్ మొత్తం కూడా ఏకపక్షంగా సాగింది. ఏకంగా 5-0 తేడాతో జదుమణి సింగ్ జయకేతనం ఎగురవేశాడు. ఈ గెలుపుతో క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాడీ మణిపూర్ బాక్సర్.
బౌట్ ఆరంభం నుంచే రింగ్ లో మెరుపులా కదిలాడు. బలమైన పంచ్‌లతో విరుచుకుపడ్డాడు. అంతకుముందు జరిగిన రౌండ్ ఆఫ్ 32లో స్కాట్లాండ్ కే చెందిన ఆరోన్ కల్లెన్‌ను ఓడించి ఊపుమీదున్న జదుమణి.. ఆ తదుపరి రౌండ్ లో కూడా అదే స్థాయిలో చెలరేగాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. తన పదునైన పంచ్‌లతో ఉక్కిరిబిక్కిరికి గురి చేశాడు. అతని వ్యూహాత్మక దాడులను ఏమాత్రం తిప్పికొట్టలేకపోయాడు సుమామా రెహ్మాన్. చేతులెత్తేశాడు.

ఏ రౌండ్ లో కూడా కనీస ప్రతిఘటన ఇవ్వలేకపోయాడు. దీంతో ఈ గేమ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. 5-0 తేడాతో జదుమణి చేతిలో ఓడిపోయాడు. ఈ విజయంతో జదుమణి..క్వార్టర్ ఫైనల్ లో అడుగు పెట్టాడు. ఈ నాకౌట్స్ బౌట్.. మంగళవారం జరుగనుంది. ఇందులో గెలిస్తే సెమీఫైనల్స్ లో అడుగు పెడతాడు. ఈ గేమ్ ముగిసిన వెంటనే స్టేడియం మొత్తం కూడా భారత్ మాతా కి జై, ఇండియా.. ఇండియా నినాదాలతో హోరెత్తింది.
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా జదుమణి ఈ విజయాన్ని అందుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ బౌట్ ను కార్గిల్ యుద్ధ అమర వీరులకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ టోర్నీలో పసిడి పతకం గెలవడమే తన ఏకైక లక్ష్యమని చెప్పాడు. మొదటి రౌండ్ ముగిసిన తర్వాత ప్రత్యర్థి ఆట తీరు, కదలికలను జాగ్రత్తగా గమనించానని, దానికి అనుగుణంగా తదుపరి రౌండ్‌లల్లో పంచ్ వ్యూహాలను రూపొందించుకున్నానని వివరించాడు.
మరోవైపు బాక్సింగ్ మహిళల విభాగంలో కూడా సంచలనం నమోదైంది. ఆసియా క్రీడల కాంస్య పతక విజేత ప్రీతి పవార్ రెండో రౌండ్‌లోనే విజయం సాధించారు. మలావికి చెందిన డెబోరా మెంజెను మట్టికరిపించారు. మ్యాచ్ ప్రారంభ సమయం నుంచే పూర్తి ఆధిపత్యం చెలాయించిన ప్రీతి.. తన మెరుపు వేగంతో డెబోరాను కోలుకునే అవకాశమే ఇవ్వలేదు. వరుస దాడులతో విరుచుకుపడటంతో రిఫరీ మ్యాచ్‌ను మధ్యలోనే నిలిపివేసి ప్రీతిని విజేతగా ప్రకటించారు. దీంతో ఆమె సునాయాసంగా క్వార్టర్ కు క్వాలిఫై అయ్యారు. ఇక్కడ గెలిస్తే ప్రీతికి తొలి కామన్వెల్త్ పతకం లభిస్తుంది.
పురుషుల బాక్సింగ్ కేటగిరీలో ఓ ఎదురుదెబ్బ కూడా తగిలింది. 65 కిలోల బరువు విభాగంలో పోటీ పడిన బాక్సర్ ఆదిత్య ప్రతాప్ ఓడిపోయాడు. తొలి రౌండ్‌లోనే ఓటమిని అంగీకరించాడు. ఉగాండాకు చెందిన నుహు బట్టే చేతిలో ఆదిత్య 2-3 తేడాతో పరాజయాన్ని చవి చూశాడు. ఈ కేటగిరీ నుంచి అతను నిష్క్రమించాడు. ఇక పతకాల భారం అంతా కూడా క్వార్టర్స్ చేరిన జదుమణి సింగ్, ప్రీతి పవార్ మీదే ఆధారపడి ఉంది.












Click it and Unblock the Notifications