వరుస అపజయాల వేళ.. టీమిండియాలో చిగురించిన ఆశలు: ఆ ఇద్దరు రిటర్న్
భారత క్రికెట్ జట్టు మరో టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో భాగంగా శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. ఈ పర్యటనతో సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ త్వరలోనే లంక పర్యటనకు వెళ్లే టెస్టు జట్టును ప్రకటించనుంది.
ఆగస్టు 15న గాలే వేదికగా భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభమౌతుంది. దీనికోసం టీమిండియా ఆగస్టు 4వ తేదీన శ్రీలంకకు బయలుదేరి వెళ్లనుంది. టెస్ట్ సిరీస్‌కు ముందు సన్నద్ధతలో భాగంగా శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు లోకల్ టీమ్ తో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన భారత్.. శ్రీలంక పర్యటనతో పుంజుకోవాలని భావిస్తోంది.

సుదీర్ఘ విశ్రాంతి తర్వాత వెటరన్ స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పునరాగమనం చేయనున్నాడు. ఇది జట్టుకు ప్లస్ పాయింట్. శ్రీలంక పిచ్‌లు సాధారణంగా స్పిన్‌కు అనుకూలిస్తుండటంతో అతని అనుభవం కీలకం కానుంది. అదే సమయంలో పేస్ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా రాక కూడా దాదాపు ఖాయమైంది. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్‌లతో కూడిన పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కు బుమ్రా సారథ్యం వహించనున్నాడు.
యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ సమయంలో సుందర్ కుడి తొడకండరాల గాయానికి గురయ్యాడు. లండన్‌లో స్కానింగ్ పూర్తి చేసుకున్న అనంతరం అతని మెడికల్ రిపోర్టులను బీసీసీఐ మెడికల్ టీమ్ కు పంపారు. ప్రస్తుతం అతను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్ లో ఉంటోన్నాడు. సుందర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో శ్రీలంక పర్యటనకు అతని పేరును పరిశీలించే అవకాశాలు దాదాపుగా లేవు.
వాషింగ్టన్ సుందర్ లంక పర్యటన సమయానికి ఫిట్‌నెస్ సాధించలేకపోతే, సెలెక్టర్లు ఇతర స్పిన్ ఆల్‌రౌండర్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ రేసులో హర్ష్ దూబే, సారన్ష్ జైన్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు కుల్ దీప్ యాదవ్, మానవ్ సుతార్ తమ స్థానాలను నిలబెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. పిచ్‌ల స్వభావాన్ని బట్టి స్పిన్నర్ల ఎంపికపై టీమ్ మేనేజ్‌మెంట్ తుది నిర్ణయం తీసుకోనుంది.
బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఫిట్‌నెస్‌పై సందిగ్ధత కొనసాగుతోంది. ప్రస్తుతం అతను కూడా బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి అందుబాటులో లేకపోతే అతని స్థానంలో ఓ స్పెషలిస్ట్ బ్యాటర్ అవసరమౌతుంది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఈ టెస్టు సిరీస్ భారత్‌కు అత్యంత కీలకం కానుంది.












Click it and Unblock the Notifications