సంజు శాంసన్ అవుట్: నక్కతోక తొక్కిన ఐపీఎల్ స్టార్: టీమిండియాలో 5 కొత్త ముఖాలు
ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్, వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ కోసం బీసీసీఐ కొద్దిసేపటి కిందటే భారత జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని 13 మంది సభ్యుల జట్టుకు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యాడు. గతంలో ఈ బాధ్యతలు నిర్వర్తించిన రిషబ్ పంత్ తన స్థానాన్ని కోల్పోయాడు. రిషభ్ పంత్ స్థానంలో రాహుల్ వైస్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. రిషబ్ పంత్ వికెట్ కీపర్-బ్యాటర్‌గా జట్టులో కొనసాగుతారు.
ఈ జట్టులో ముగ్గురు కొత్త ముఖాలకు చోటు దక్కింది. పంజాబ్ కింగ్స్ పేసర్ గుర్నూర్ బ్రార్, సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డిని టెస్ట్ జట్టులోకి తీసుకున్నారు. యువత, అనుభవజ్ఞుల కలయికతో కూడిన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. బౌలింగ్ విభాగంలో మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ పేస్ బాధ్యతలు పర్యవేక్షిస్తారు. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ స్పిన్ బౌలింగ్ డిపార్ట్ మెంట్ లో కొనసాగుతారు.

ఇండియా-ఏ సిరీస్‌లో అద్భుతంగా ఆడిన సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. దేవదత్ పడిక్కల్, యశస్వి జైస్వాల్ కూడా బ్యాటింగ్ విభాగంలో ఉన్నారు. రిషబ్ పంత్‌తో పాటు ధ్రువ్ జురెల్ రెండవ వికెట్ కీపర్ గా ఎంపికయ్యాడు. సీనియర్ ఆటగాళ్ల పని భారాన్ని దృష్టిలో ఉంచుకొని పలువురు ప్రధాన ఆటగాళ్లకు ఈ టెస్ట్ సిరీస్ నుండి విశ్రాంతి కల్పించారు. జస్ ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు సెలెక్టర్లు
భారత టెస్ట్ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, మానవ్ సుతార్, ధ్రువ్ జురెల్.
అలాగే- వన్డే జట్టును కూడా ప్రకటించారు సెలెక్టర్లు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఈ జట్టు కూర్పును ఖరారు చేసింది. ఇది.. కొందరు ఆటగాళ్ల కెరీర్‌ను ప్రమాదంలో పడేయగా, మరికొందరికి మాత్రం ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమం చేశాయి. సెలక్షన్ కమిటీ తీసుకున్న కీలక నిర్ణయాల్లో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను జట్టు నుంచి తొలగించడం అతిపెద్దది. అతని స్థానంలో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు చోటు దక్కింది.
ఇషాన్ కిషన్ మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి వన్డే జట్టులోకి రావడం గమనార్హం. ఆఫ్ఘనిస్తాన్‌తోనే అతను చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఆడనున్నారు. రోహిత్ ఫిట్‌నెస్ ఆధారంగానే అతనికి అవకాశం లభించింది. వందశాతం ఫిట్ నెస్ తో ఉంటేనే తుదిజట్టులోకి తీసుకుంటారు. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు అనూహ్యంగా ఈ వన్డే జట్టులో చోటు దక్కలేదు. అతని స్థానంలో కొత్తవారికి అవకాశం లభించింది.
జట్టులో ముగ్గురు యువ ఆటగాళ్లకు అద్భుత అవకాశం లభించింది. లక్నో తరపున ఐపీఎల్‌లో రాణించిన ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ కు చోటు దక్కింది. ఇతనికి 14 లిస్ట్-ఏ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అనుభవం ఉంది. అలాగే తొమ్మిది లిస్ట్-ఏ మ్యాచ్‌లు, ఒకే ఐపీఎల్ మ్యాచ్ అనుభవం ఉన్న ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్, ఎడమచేతి వాటం స్పిన్నర్ హర్ష్ దుబే కూడా జట్టులోకి ఎంపికయ్యారు.
సెలెక్టర్లు తీసుకున్న అత్యంత ఆశ్చర్యకరమైన నిర్ణయాల్లో ఒకటి సంజు శాంసన్‌ను విస్మరించడం. టీ20 ఫార్మాట్‌లో అద్భుతంగా రాణించి, టీ20 ప్రపంచకప్‌ను గెలిపించిన, ఐపీఎల్‌లోనూ మెరుగైన ఆటతీరు కనబరిచిన అతనికి చోటు దక్కలేదు. వన్డే క్రికెట్‌లో 56 కంటే ఎక్కువ సగటు ఉన్నప్పటికీ, అతనిని పరిగణనలోకి తీసుకోలేదు.
వన్డే సిరీస్ కోసం భారత జట్టు: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, హర్ష్ దుబే.












Click it and Unblock the Notifications