ఆ ఒక్క పాయింట్ తో సెమీస్ కు పాకిస్తాన్?
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ సెమీఫైనల్ అవకాశాలు ఇప్పుడు సంక్లిష్టం. సూపర్ 8లో తొలుత న్యూజిలాండ్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో ఒక్క పాయింట్ తోనే సరిపెట్టుకున్న పాకిస్తాన్ జట్టు.. తాజాగా ఇంగ్లాండ్ చేతిలో మట్టికరిచింది. ఇది ఆ జట్టుకు అతి పెద్ద లాస్. ఫలితంగా సల్మాన్ అఘా సేన తీవ్ర ఒత్తిడిలో పడింది. పాకిస్తాన్ చేతిలో ఉన్నది ఒక్క మ్యాచే. ఆ జట్టు తన తదుపరి మ్యాచ్ లో శ్రీలంకతో ఆడాల్సి ఉంది. ఈ నెల 28వ తేదీన ఈ మ్యాచ్ జరుగుతుంది.
ఇంగ్లాండ్ చేతిలో ఓటమితో పాకిస్తాన్ ఖాతాలో ఉన్నది ప్రస్తుతానికి ఒక్క పాయింట్ మాత్రమే. పాకిస్తాన్ టోర్నమెంట్ నుంచి పూర్తిగా నిష్క్రమించట్లేదు. అవకాశాలు కూడా ఇంకా సజీవంగానే ఉన్నాయి. పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరాలంటే శ్రీలంకపై భారీ అంతరంతో గెలవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇతర జట్ల ఫలితాలు కూడా అనుకూలంగా వెలువడాల్సి ఉంటుంది.

28న శ్రీలంకతో జరిగే చివరి సూపర్-8 మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిస్తే, వారి ఖాతాలో గరిష్టంగా మూడు పాయింట్లు చేరతాయి. అంతమాత్రాన పాకిస్తాన్ సెమీఫైనల్‌కు అర్హత సాధించినట్లు కాదు. న్యూజిలాండ్ మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోవాలి. అప్పుడు పాకిస్తాన్ కంటే కూడా న్యూజిలాండ్ ఖాతాలో పాయింట్లు తక్కువ పడతాయి. ఆ స్థితిలో న్యూజిలాండ్ ఎలిమినేట్ అవుతుంది. సెమీస్ చేరే అవకాశం మరింత మెరుగుపడుతుంది పాకిస్తాన్ కు.
న్యూజిలాండ్‌కు ఇంకా రెండు టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. శ్రీలంక, ఇంగ్లాండ్ తో తలపడాల్సి ఉంది. పాకిస్తాన్.. శ్రీలంకను ఓడించితే , న్యూజిలాండ్ ఆ రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోతే, పాకిస్తాన్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఈ స్థితిలో పాకిస్తాన్ మూడు పాయింట్లు, శ్రీలంక రెండు పాయింట్లు కలిగి ఉంటాయి దీంతో పాకిస్తాన్‌కు సెమీఫైనల్ టికెట్ లభిస్తుంది. శ్రీలంక నాకౌట్ అవుతుంది.
ఒకవేళ న్యూజిలాండ్.. శ్రీలంకను ఓడించి, తర్వాత ఇంగ్లాండ్‌తో ఓడిపోయిందనుకుంటే అప్పుడు పాకిస్తాన్, న్యూజిలాండ్ రెండూ మూడేసి పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. ఈ సందర్భంలో, నెట్ రన్ రేట్ సెమీఫైనల్ బెర్త్‌ను నిర్ణయిస్తుంది. అదే క్రమంలో న్యూజిలాండ్ తమ మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ గెలిస్తే, పాకిస్తాన్ సెమీఫైనల్ రేసు నుండి పూర్తిగా నిష్క్రమిస్తుంది. ఎందుకంటే న్యూజిలాండ్ ఈ రెండు విజయాలతో మొత్తం అయిదు పాయింట్లను సాధించి సులభంగా అర్హత పొందుతుంది.












Click it and Unblock the Notifications