సెలెక్షన్ కమిటీ నుంచి అవుట్: మాజీ స్టార్ స్పిన్నర్ కు పిలుపు?
Asia Cup 2025 India Squad: సెప్టెంబర్ 9వ తేదీన ఆరంభం కానున్న ఆసియా కప్ 2025లో ఆడబోయే భారత జట్టుపై అప్పుడే అసహనం, అసంతృప్తి చెలరేగింది. ఈ జట్టులో ఇద్దరు టీ20 స్పెషలిస్టులకు చోటు దక్కకపోవడమే దీనికి కారణం. ఉద్దేశపూరకంగానే వారిని ఎంపిక చేయలేదనే వాదనలు మొదలయ్యాయి.
మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా టీ20 ఫార్మట్ కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే. టెస్ట్ ఫార్మట్ కేప్టెన్ శుభ్‌మన్ గిల్ కు వైస్ కేప్టెన్సీ బాధ్యత అప్పగించారు. జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇచ్చాడు.

యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లకు చోటు దక్కలేదు. సంజూ శాంసన్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా జితేష్ శర్మను ఎంపిక చేశారు. పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యాతో పాటు శివమ్ దూబే అవకాశాన్ని అందుకున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీలను కొనసాగించారు. మూడో పేసర్‌గా హర్షిత్ రాణాను తీసుకున్నారు.
యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ కు చోటు దక్కకపోవడం చర్చనీయాంశమౌతోంది. టీ20 ఫార్మట్ లో సాగే ఐపీఎల్ మ్యాచ్ లల్లో ఆడిన అపారమైన అనుభవం ఉన్నప్పటికీ వారిద్దరినీ ఎంపిక చేయపోవడం పట్ల మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్, క్రిష్ణమాచారి శ్రీకాంత్ వంటి లెజెండరీ ప్లేయర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు. బీసీసీఐ నిర్ణయాలపై మండిపడుతున్నారు.
ఈ పరిస్థితుల మధ్య సెలెక్షన్ కమిటీలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది బీసీసీఐ. ఇద్దరు సెలెక్టర్లపై వేటు వేసింది. వారి కాంట్రాక్ట్ గడువును పొడిగించలేదు. ఈ ఇద్దరి స్థానాన్ని భర్తీ చేయడానికి దరఖాస్తులను సైతం ఆహ్వానించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తన అధికారిక వెబ్ సైట్ లో దీనికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది.
ప్రస్తుతం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ప్యానెల్‌కు భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో శివ సుందర్ దాస్ (సెంట్రల్ జోన్), సుబ్రతో బెనర్జీ (ఈస్ట్ జోన్), అజయ్ రాత్రా (నార్త్ జోన్), శ్రీధరన్ శరత్ (సౌత్ జోన్) ఉన్నారు. వీరిలో శరత్, అజయ్ రాత్రాను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శరత్ స్థానంలో భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా వచ్చే అవకాశం ఉంది.
అజిత్ అగార్కర్ 2026 వరకు చీఫ్ సెలక్టర్‌గా కొనసాగే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం ఏడు టెస్ట్ మ్యాచ్‌లు లేదా 30 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. కనీసం 10 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు లేదా 20 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో అనుభవం ఉన్న అభ్యర్థులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
భారత జట్టును అన్ని ఫార్మాట్లలో అంటే టెస్టులు, వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 ఇంటర్నేషనల్స్, బీసీసీఐ నిర్ణయించిన ఇతర ఫార్మాట్లలో ఎంపిక చేయాల్సి ఉంటుంది. క్రికెట్ నుండి కనీసం ఐదేళ్ల ముందు రిటైర్ అయి ఉండాలి. గతంలో అయిదేళ్ల పాటు బీసీసీఐ క్రికెట్ కమిటీలో సభ్యుడిగా ఉండకూడదు.
అగార్కర్‌ను జూలై 2023లో నియమించారు. అతని హయాంలో జాతీయ జట్టు 2023 ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకోవడం, 2024లో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ గెలవడం, 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం వంటి అనేక కీలక విజయాలను సాధించింది. ఈ విజయాలు అగార్కర్‌ను కొనసాగించడానికిప్రధాన కారణాలుగా బీసీసీఐ పరిగణిస్తోంది.












Click it and Unblock the Notifications