ఆ అండర్ డాగ్ ను ఫైనల్ లో చూడాలని ఉంది- రాహుల్ ద్రావిడ్
టీ20 వరల్డ్ కప్ లో భారత్ నేడు కీలక మ్యాచ్ ఆడబోతోంది. గత వరల్డ్ కప్ ఫైనలిస్ట్ దక్షిణాఫ్రికాను ఎదుర్కొనబోతోంది. నాటి ఫైనల్ రీమ్యాచ్‌గా పరిగణిస్తోన్నారు దీన్ని. ఈ సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదిక. ఈ టోర్నమెంట్‌లో భారత్ కు సమవుజ్జీగా నిలిచింది దక్షిణాఫ్రికా. లీగ్స్ ఏ ఈ రెండు జట్లు కూడా ఏ ఒక్క మ్యాచ్ ను కూడా ఓడిపోలేదు. తమ ప్రత్యర్థులను చిత్తుచేసి సూపర్ 8లోకి ఎంట్రీ ఇచ్చాయి.
ఏ జట్టు గెలుస్తుందో.. ఏది ఓడుతుందో అని అంచనాలు వేయలేనంత పటిష్టంగా ఉన్నాయివి. రెండు జట్లు కూడా ఈ టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. టీ20 క్రికెట్‌లో ప్రస్తుతానికి అత్యుత్తమ జట్లుగా నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈ పోరాటం జరగనుంది. బలమైన బ్యాటింగ్ లైనప్‌లు, అత్యుత్తమ బౌలర్లు ఈ రెండు జట్లకు బలంగా ఉన్నాయి.

ఈ పరిణామాల మధ్య టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో జింబాబ్వే ఆడితే బాగుంటుందని అన్నారు. భారత్- జింబాబ్వే మధ్య ఫైనల్ మ్యాచ్ జరగాలని కోరుకుంటోన్నట్లు తెలిపారు. ఈ రెండు జట్ల మధ్య గేమ్ పడితే చూడాలని ఉందని ఆకాంక్షించారు. భారత్ తో ఏ జట్టు తలపడినా ఫర్వాలేదని, ఈ టోర్నమెంట్‌లో అండర్ డాగ్ గా ఆడుతూ అనూహ్యంగా సూపర్ 8కు చేరిన జింబాబ్వే ఫైనల్ చేరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
మార్చి 8వ తేదీన అహ్మదాబాద్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియా వంటి అత్యంత బలమైన జట్టును ఎదుర్కొనడం జింబాబ్వే క్రికెట్‌కు చాలా మేలు చేస్తుందని రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డారు. ఒకరిద్దరు ప్లేయర్లపై భారత్ ఆధారపడకపోవడం అతి గొప్ప బలమని, జట్టు మొత్తం ఫామ్ లో ఉండటం ప్లస్ పాయింట్ అని చెప్పుకొచ్చారు ద్రావిడ్. టీ20ల్లో ఊహించనివి చాలా జరుగుతాయని, అత్యంత అస్థిరమైన ఫార్మాట్ ఇదేనని చెప్పాడు.
భారత్, జింబాబ్వే ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. రెండూ సెమీ ఫైనల్స్‌కు చేరుకోవాలంటే గత సంవత్సరం రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా, రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌ను ఓడించాల్సి ఉంటుంది. ఇది దాదాపుగా అసాధ్యం అనే అనుకోవచ్చు గానీ ఈ షార్ట్ ఫార్మట్ క్రికెట్ లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఆస్ట్రేలియా, శ్రీలంకను ఓడించిన సత్తా జింబాబ్వేది. ప్రస్తుతం సూపర్ 8 చేరిన జట్లతో పోల్చుకుంటే జింబాబ్వేను ఓ పసికూనగానే చెప్పుకోవచ్చు.
టీ20 వరల్డ్ కప్ వంటి భారీ టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్ వరకు ఎప్పుడూ చేరుకోలేదు గానీ లీగ్స్ లో ఒమన్ ను ఓడించడం ద్వారా బోణీ కొట్టిన జింబాబ్వే ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. టైటిల్ హాట్ ఫేవరెట్ ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. అలాగే శ్రీలంకనూ ఓడించింది.












Click it and Unblock the Notifications