నేడే ఐపీఎల్ ఫైనల్- వర్షం ముప్పు: మ్యాచ్ రద్దయినా ఆర్సీబీదే కప్?
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ ఫైనల్ వచ్చేసింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ సాయంత్రం ఈ మెగా మ్యాచ్ జరగనుంది. ట్రోఫీ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) తలపడనున్నాయి. క్వాలిఫైయర్ 1లో విజయం సాధించి ఆర్‌సీబీ నేరుగా ఫైనల్‌కు చేరుకోగా, క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి గుజరాత్ టైటాన్స్ తన బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
రెండున్నర నెలల పాటు 10 జట్లతో 70కి పైగా మ్యాచ్‌లతో సాగిన ఈ క్రికెట్ పండుగ ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది. ఈ పరిస్థితుల్లో వాతావరణ అంచనాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. వర్షం పడే అవకాశాలు 80 శాతం వరకు ఉన్నాయి. సాయంత్రం నుంచి రాత్రిలోగా ఓ మోస్తరు వర్షపాతం నమోదు కావొచ్చని అహ్మదాబాద్ వాతావరణం కేంద్రం అంచనావేస్తోంది.

వర్షం పడితే ఫైనల్ మ్యాచ్‌ను పూర్తి చేయడానికి కొన్ని స్పష్టమైన నియమాలు, అత్యవసర ప్రణాళికలు ఉన్నాయి. ఎక్స్ ట్రా టైమ్ నుండి రిజర్వ్ డే వరకు ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. వర్షం వల్ల మ్యాచ్ కు అంతరాయం కలిగితే షెడ్యూల్ చేసిన రోజే ఫైనల్‌ను పూర్తి చేయడానికి తొలి ప్రాధాన్యత ఇస్తారు. ఓవర్ల సంఖ్యను కుదించడం ఇందులో ఒకటి.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఫైనల్ కోసం అదనంగా 120 నిమిషాల సమయం కేటాయించవచ్చు. రెండు జట్లు కనీసం అయిదు ఓవర్ల చొప్పున బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటేనే ఇది అమలు అవుతుంది. అది కూడా కుదరకపోతే ఫైనల్ కోసం జూన్ 1న రిజర్వ్ డే ఉంటుంది. వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకపోతే మొత్తం మ్యాచ్ రిజర్వ్ డే కు షిఫ్ట్ చేస్తారు.
షెడ్యూల్ చేసిన తేదీన మ్యాచ్ ప్రారంభమై వాతావరణ అంతరాయాల వల్ల పూర్తి కాకుండా ఆగిపోయినా రిజర్వ్ డేను ఉపయోగించవచ్చు. అప్పుడు టోర్నమెంట్ నిబంధనల ప్రకారం.. మ్యాచ్ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే తిరిగి ప్రారంభమవుతుంది. రిజర్వ్ డే నాడు కూడా వాతావరణం అనుకూలించకపోతే మ్యాచ్ రద్దవుతుంది. ఐపీఎల్ నియమాల ప్రకారం, లీగ్ దశ పాయింట్ల పట్టిక ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ ది రెండో స్థానం. ఫైనల్ గేమ్ పూర్తిగా రద్దయితే ఆర్‌సీబీనే ఛాంపియన్‌గా ప్రకటిస్తారు.












Click it and Unblock the Notifications