Ind vs NZ: "జీర్ణించుకోలేకపోతున్నా"- ఆ సీనియర్ ను తీసుకోకపోవడంపై గవాస్కర్ నిరాశ..!
భారత్-న్యూజీలాండ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా వెల్లింగ్టన్ లో ఇవాళ తొలి మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్ లో ఆరంభంలో 70 పరుగులకే 5 వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు.. ఆ తర్వాత మాత్రం తేలిపోయారు. దీంతో నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ జోడీ ఏకంగా 170 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ గతినే మార్చేశారు. ఐదు వికెట్ల తర్వాత వీరి జోడీని విడదీసేందుకు టీమిండియా చేయని ప్రయత్నం లేదు. అయినా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇవాళ తొలి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి కివీస్ 5 వికెట్లకు 243 పరుగులతో పటిష్ట స్ధితిలో ఉంది. నికోల్స్ సెంచరీ పూర్తి చేసుకుని 113 పరుగులతోనూ, ఫిలిప్స్ 94 పరుగులతోనూ అజేయంగా నిలిచారు. దీంతో భారత బౌలర్ల వైఫల్యం చర్చనీయాంశమైంది.
ఇదే అంశంపై క్రికెట్ దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) నిరాశ చెందుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమ్ మేనేజ్ మెంట్ తుది జట్టులోకి పరిగణనలోకి తీసుకున్న టాప్ నలుగురు టెస్ట్ బౌలర్ల జాబితాలో హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ లేకపోవడం అనేది జీర్ణించుకోవడానికే కష్టంగా ఉందని సన్నీ తెలిపారు. అన్షుల్ కాంబోజ్, ప్రసిద్ధ్ కృష్ణలు టెస్టు క్రికెట్ ఆడటం మొదలుపెట్టి కేవలం ఒకటి, రెండేళ్లు మాత్రమే అయ్యిందని, మరోవైపు, అనుభవజ్ఞుడైన మహమ్మద్ సిరాజ్ అందుబాటులో ఉన్నప్పటికీ, అతడిని ఎంపిక చేయలేదని గవాస్కర్ తెలిపారు. సిరాజ్ మీ టాప్ నలుగురు బౌలర్లలో లేడనే విషయాన్ని అంగీకరించడం నాకు చాలా కష్టంగా అనిపిస్తోందన్నారు.

అతను ఖచ్చితంగా వికెట్లు తీసేవాడని నేను చెప్పడం లేదు, కానీ ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ చేసిన తీరును చూస్తుంటే, అనుభవం లేకపోవడం ఎంతటి లోటుగా మారిందో అర్థమవుతుందన్నారు. గణాంకాలు, ఎకానమీ రేటు అన్నీ బాగున్నట్లు అనిపించవచ్చుని, బంతి స్వింగ్ అవుతోంది, స్టంప్‌లకు దూరంగా బౌలింగ్ చేస్తున్నారు, దీనివల్ల బ్యాటర్లు బంతులను వదిలేస్తున్నారు, ఫలితంగా ఎకానమీ రేటు మెరుగ్గా కనిపిస్తోందని సన్నీ విశ్లేషించారు. భారత బౌలర్లు తొలి సెషన్‌లో చాలా బాగా రాణించారని, కానీ ఆ తర్వాత వెంటనే మరికొన్ని వికెట్లు తీసి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేదని సోనీ స్పోర్ట్స్‌లో రెండో సెషన్ ముగిసిన తర్వాత గవాస్కర్ వ్యాఖ్యానించారు.














Click it and Unblock the Notifications
