భారత్ ను సెమీస్ తీసుకెళ్లే బాధ్యత దక్షిణాఫ్రికాదే, ఇదీ అసలు లెక్క..!!
T20 World cup semis: టీ20 ప్రపంచ కప్ లో లెక్కలు మారుతున్నాయి. టీం ఇండియా సెమీస్ చేరుతుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. సూపర్ -8 లో సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్ లో ఓటమితో ఈ పరిస్థితి ఏర్పడింది. అటు ఇంగ్లాండ్ సెమీస్ కు చేరుకుంది. ఇటు టీమిండియా సెమీస్ కు చేరాలంటే వచ్చే రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించాలి. రన్ రేటు కీలకంగా మారుతోంది. దీంతో.. ఇప్పుడు భారత్ సెమీస్ చేరాలంటే దక్షిణాఫ్రికా ఆట తీరు.. ఆడే మ్యాచుల్లో ఫలితం ఇండియా కు అర్హతను తేల్చనుంది. ఇదీ ఇప్పుడు అసలు లెక్కగా మారింది.
టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా నిలవాలి... సెమీస్ కు వెళ్లాలంటే 26న జింబాబ్వే... మార్చి 1న వెస్టిండీస్ తో గెలవటమే కాదు. అంతకు మించి అన్నట్లుగా ఆట ఉండాలి. మైనస్ రన్ రేటు ఉన్న టీమిండియా భారీ స్కోరు సాధించాలి.. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు కట్టడి చేయాలి. అదే విధంగా ఛేజింగ్ లో అయితే.. బ్యాటర్లు వీర విహారం చేసి చావో రేవో అన్నట్లుగా తక్కువ ఓవర్లకే లక్ష్యం చేరుకుంటనే సెమీస్ రేసులో అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పుడు ఉన్న లెక్కలు ఏం జరిగితే టీం ఇండియా సెమీస్ కు చేరుతుందో తేల్చి చెబుతున్నాయి. ఫిబ్రవరి 26వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరగనున్న మ్యాచ్ ఫలితం కీలకం. ఆ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలిచి వెస్టిండీస్ ను ఓడించాలి. ఇదే సమయంలో, టీమిండియా తన తదుపరి రెండు మ్యాచ్ లను జింబాబ్వే, వెస్టిండీస్ పై భారీ విజయాలతో గెలవటం తప్పనిసరి.

రెండు మ్యాచుల్లో భారీ రన్ రేట్ తో గెలిస్తేనే
అదే విధంగా ఒకవేళ ఫిబ్రవరి 26న జరిగే మ్యాచ్ లో వెస్టిండీస్ విజయం సాధిస్తే, టీమిండియా సెమీఫైనల్ అవకాశాలు దాదాపు అసాధ్యం అవుతాయి. ఇదే సమయంలో వర్షం కురిస్తే ఫలితం ఎలా ఉంటుందనేది కీలకంగా మారుతోంది. వర్షం కూడా టీమిండియాకు అనుకూలంగా మారే ఛాన్స్ ఉంది. దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే, ఆ సమయంలో టీమిండియా తన తదుపరి రెండు మ్యాచుల్లో గెలిస్తే సెమీఫైనల్స్ కు సులభంగా చేరుకుంటుంది. దీంతో.. ఇప్పుడు వచ్చే రెండు మ్యాచుల కోసం టీం ఇండియా కూర్పు.. టీం ఆట తీరుతో పాటుగా టాస్ - పిచ్ కండీషన్లు సైతం ప్రభావం చూపించనున్నాయి. వాతావరణం సైతం భారత్ సెమీస్ అవకాశాలను ప్రభావితం చేయనుంది. దీంతో... సెమీస్ కు భారత్ చేరాలని కోరుకునే ప్రతీ అభిమాని.. సూపర్ -8 ఫలితాలతో మారుతున్న లెక్కలు... సమీకరణాల ను ఆసక్తి గా గమనిస్తున్నారు. అసలు భారత్ సెమీస్ చేరుతుందా లేదా అనేది ఈ నెల 26న జరిగే మ్యాచుల తరువాత దాదాపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications