బౌలర్లను దంచుడు పక్కన పెట్టి.. ఆ గుద్దులాటలు ఏంది బుడ్డోడా?
శ్రీలంకలోని దంబుల్లా వేదికగా ఇండియా-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్ ముగిసిన తర్వాత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ సారి వైభవ్ వార్తల్లో నిలిచింది ఆటతీరుతో కాదు.. ప్రత్యర్థి ఆటగాళ్లతో పెట్టుకున్న వాగ్వాదంతో నిలిచాడు. మ్యాచ్‌లో ఓటమి అనంతరం శ్రీలంక ఆటగాళ్లతో వైభవ్ సూర్యవంశీ తీవ్ర వాగ్వాదానికి దిగడం, ఆటగాళ్లను నెట్టిన తీరు అతడి ప్రవర్తనపై పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది. కేవలం 15 ఏళ్ల వయసున్న ఈ బ్యాటర్ ను భారత క్రికెట్ భవిష్యత్తుగా అభివర్ణిస్తున్నారు. కానీ ఈ తాజా సంఘటన వైభవ్ సూర్యవంశీ ఓ ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతోంది. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలంటే కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు.. అంతకంటే మిన్నగా సంయమనం, క్రమశిక్షణ కూడా అంతే అవసరమని ఈ ఘటన నిరూపిస్తోంది.
క్రికెట్ ప్రపంచంలో టాలెంట్ అనేది రాత్రికి రాత్రే స్టార్ ను చేస్తుంది. కానీ వ్యక్తిత్వం మాత్రమే ఓ గొప్ప ఆటగాడిగా మారుస్తుంది. వైభవ్ సూర్యవంశీలో ప్రతిభకు ఎలాంటి కొరత లేదు. ఈ చిన్న వయసులోనే వైభవ్ సాధించిన విజయాలు అసాధారణమైనవి. కానీ శ్రీలంక-ఏతో మ్యాచ్ ముగిసిన అనంతరం స్టేడియంలో కనిపించిన దృశ్యాలు భారత క్రికెట్ అభిమానులను కాస్త కలవరపెట్టాయి. వైభవ్ సూర్యవంశీ కేవలం పరుగులు చేయడంపైనే కాదు.. స్టేడియంలో తన భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడంపై కూడా దృష్టి పెట్టాలని ఈ ఘటన గుర్తుచేస్తోంది. ఓ అద్భుతమైన ఆటగాడి నుంచి మహోన్నతమైన క్రికెటర్ గా ఎదగడానికి వైభవ్ సూర్యవంశీకి ఈ మార్పు చాలా అవసరం.

సూపర్ ఓవర్లో ఓడిపోయిన బాధ, నిరాశ ఏ ఆటగాడికైనా సహజమే. ముఖ్యంగా మ్యాచ్ చివరి క్షణాల వరకు ఉత్కంఠగా సాగి చేజారినప్పుడు భావోద్వేగాలు కట్టలు తెంచుకుంటాయి. గెలిచిన ఉత్సాహంలో ప్రత్యర్థి ఆటగాళ్లు కొన్నిసార్లు రెచ్చగొట్టేలా మాట్లాడటం, మితిమీరిన సంబరాలు చేసుకోవడం సహజమే. కానీ అంతర్జాతీయ క్రికెట్ దిశగా అడుగులు వేస్తున్న ఏ ఆటగాడైనా.. ఎప్పుడు సమాధానం చెప్పాలి, ఎప్పుడు మౌనంగా ముందుకు సాగిపోవాలనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒత్తిడి సమయాల్లో సహనాన్ని కోల్పోకుండా ఉండటమే గొప్ప ఆటగాళ్ల ముఖ్య లక్షణం. మైదానంలో ఎదురయ్యే ఉద్రిక్తతలకు మాటలతోనో, చేతులతోనో కాకుండా.. బ్యాట్‌తోనే సమాధానం చెప్పడం అత్యుత్తమ క్రీడా సంస్కృతి అనిపించుకుంటుంది.
🚨 HEATED ARGUMENT BETWEEN VAIBHAV AND SRI LANKA 🚨
— Ajay Jadeja (@AjayJadeja171) June 15, 2026
Sri Lankan Players : This is not an IPL, this Int'l cricket 🧐
Vaibhav Sooryavanshi : This is not the end of the tournament, just a normal match 🤪
Sri Lankan started this and Vaibhav ended it 😳pic.twitter.com/QDNbFftd0t
దంబుల్లా మ్యాచ్ మొదటి నుంచి చివరి వరకు ఇరు జట్ల మధ్య ఒత్తిడితో కూడి వాతావరణంలోనే సాగింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఆటగాళ్ల మధ్య ఘర్షణ వాతావరణం కనిపిచింది. అంపైర్ల నిర్ణయాలపై కూడా వాగ్వాదాలు జరిగాయి. చివరికి సూపర్ ఓవర్లో శ్రీలంక ఏ విజయం సాధించాక స్టేడియంలో వాతావరణం ఇంకా వేడెక్కింది. పరస్పర విమర్శలతో శ్రీలంక ఆటగాడు, వైభవ్ సూర్యవంశీ మధ్య గొడవ మొదలైంది. ఇద్దరు ఆటగాళ్లు నెట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది. వెంటనే శ్రీలంక వికెట్ కీపర్, ఇతర సీనియర్ ఆటగాళ్లు మధ్యలో జోక్యం చేసుకుని ఇద్దరినీ పక్కకు లాగడంతో ప్రమాదం తప్పింది.
వైభవ్ సూర్యవంశీ దూకుడు ప్రవర్తనతో వార్తల్లోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అండర్-19 స్థాయిలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ వైభవ్ ప్రవర్తనపై చర్చ నడిచింది. అప్పట్లో దానిని యువ రక్తం, కసి అని సరిపెట్టుకున్నప్పటికీ.. ఇలాంటి సంఘటనలు పదే పదే పునరావృతమైతే అది ఓ అలవాటుగా మారే అవకాశం ఉంది. క్రికెట్లో దూకుడు తప్పుకాదు.. ఎందరో గొప్ప ఆటగాళ్లు తమ దూకుడుతోనే చరిత్ర సృష్టించారు. కానీ ఆ దూకుడు గీత దాటి.. ఆట కంటే ఆటగాడి ప్రవర్తన గురించి మాట్లాడుకునే పరిస్థితి వస్తేనే సమస్య మొదలవుతుంది. ఈ కాలంలో అంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఒకప్పుడు ఆటగాడి సెంచరీల గురించి చర్చించుకునేవారు.. కానీ ఇప్పుడు 10 సెకన్ల నెగెటివ్ వీడియో క్లిప్ కూడా కెరీర్‌ను ఇరకాటంలో పడేయగలదు. అయితే దంబుల్లాలో జరిగిన ఈ సంఘటన వైభవ్ సూర్యవంశీకి ఓ మంచి గుణపాఠం కావాలి.












Click it and Unblock the Notifications