ప్రపంచ కప్ విన్నర్ శ్రీచరణికి ఏపీ సర్కార్ బంపరాఫర్!
Shree Charani: భారత మహిళా క్రికెట్ జట్టు గత వారం దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించి 50 ఓవర్ల ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం ద్వారా దేశం మొత్తానికి గర్వకారణంగా నిలిచింది. ఈ చారిత్రక విజయం సాధించిన క్రీడాకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభినందనలు తెలియజేస్తూ బహుమతులు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వంతు వచ్చింది. ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో అంతర్భాగంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రతిభావంతురాలు, యువ క్రికెటర్ శ్రీ చరణి రెడ్డి కృషిని అభినందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
మహిళా స్టార్ క్రికెటర్ శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం భారీ బహుమతిని ప్రకటించినట్లు సమాచారం. గ్రూప్-1 ఉద్యోగం, రూ.2.5 కోట్ల నగదు బహుమతి, కడపలో నివాస స్థలం ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని క్రికెటర్ శ్రీచరణి వెల్లడించారు. మహిళా క్రికెట్‌ను ప్రోత్సహిస్తామని సీఎం చెప్పారని ఆమె తెలిపారు.

కడప జిల్లా బిడ్డకు ఘన సన్మానం
శ్రీ చరణి రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన యువ క్రికెటర్. ఇటీవలి ప్రపంచ కప్‌లో భారత జట్టులో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో, ఆమె కృషిని గుర్తించి తగిన గౌరవం అందించడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బాధ్యత. ఈ సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ రోజు అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసంలో శ్రీ చరణి రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆమెతో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం మంత్రి లోకేశ్ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ముఖ్యమంత్రి నివాసానికి రావడం విశేషం.
మహిళల వన్డే ప్రపంచకప్‌లో 21 ఏళ్ల శ్రీ చరణి అదరగొట్టిన సంగతి తెలిసిందే. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన ఈ ఆంధ్రా అమ్మాయి 9 మ్యాచ్‌ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టింది. ఈ 9 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ మినహా.. ప్రతీ మ్యాచ్‌లో వికెట్ తీసింది. ముఖ్యంగా సెమీస్, ఫైనల్లో ఆమె కట్టుదిట్టమైన బౌలింగ్ టీమిండియా విజయానికి బాటలు వేసింది. ఏపీలోని కడప జిల్లాలో ఉన్న ఒక మారుమూల గ్రామానికి చెందిన ఎడమచేతి వాటం స్పిన్నర్ శ్రీచరణి వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై అద్భుత ప్రదర్శనతో సత్తా చాటుకుంది. ఈ టోర్నీలో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచింది.
శ్రీచరణికి ఘన స్వాగతం
మహిళల వరల్డ్ కప్ 2025లో అద్భుతంగా రాణించిన భారత మహిళా స్టార్ క్రికెటర్ శ్రీచరణి ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానంలో శుక్రవారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో శ్రీచరణికి ఘన స్వాగతం లభించింది. ఆమెకు ఏపీ స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు, మంత్రులు అనిత, సవిత, రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ కేశినేని చిన్నిలు స్వాగతం పలికారు. శ్రీచరణిని అభినందించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత శ్రీచరణి, మిథాలీ రాజ్‌ను సీఎం క్యాంప్ కార్యాలయానికి ఎంపీలు, మంత్రులు, శాప్ ఛైర్మన్ వెంటపెట్టుకుని వచ్చారు. అక్కడ సీఎం చంద్రబాబును కలిసిన శ్రీచరణి, మిథాలీ రాజ్ వరల్డ్ కప్ గెల్చుకున్న క్షణాల్ని, టోర్నీ విశేషాలను ఆయనతో పంచుకున్నారు.












Click it and Unblock the Notifications