రోహిత్ కెప్టెన్సీకి యువరాజ్ మద్దతు-ఆ నిర్ణయంపై అసంతృప్తి..!
టీమిండియా కు అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా, ఓపెనర్ గా పలు రికార్డులు సృష్టిస్తూ, మరెన్నో రికార్డులు చెరిపేస్తూ సాగిపోతున్న రోహిత్ శర్మకు ఈ మధ్య భారీ షాక్ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను జట్టు ఫ్రాంచైజీ రిలయన్స్ సంస్ధ హఠాత్తుగా తప్పించింది. అతని స్ధానంలో గుజరాత్ టైటాన్స్ నుంచి తెచ్చుకున్న హార్దిక్ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. దీనిపై భారీ వివాదమే చెలరేగింది.
తాజాగా స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించాలన్న నిర్ణయాన్ని యువీ తప్పుబట్టాడు. హార్దిక్ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకొచ్చినా అతనికి కెప్టెన్సీ ఇవ్వకుండా రోహిత్ ను కొనసాగించి ఉండాల్సిందని యువీ అభిప్రాయపడ్డాడు. అప్పుడు భవిష్యత్తులో కెప్టెన్సీ మార్పు ప్రక్రియ సాఫీగా సాగిపోయేదన్నాడు. ఐపీఎల్ చరిత్రలో రోహిత్ శర్మ కెప్టెన్సీ రికార్డును కూడా యువీ గుర్తుచేశాడు.

రోహిత్ శర్మ ఐదుసార్లు ముంబైని ఐపీఎల్ విన్నర్ గా నిలిపాడని యువరాజ్ సింగ్ గుర్తుచేశాడు. అతన్ని తొలగించాలనుకోవడం పెద్ద నిర్ణయం అన్నాడు. రోహిత్ ను తొలగించాలనుకుంటే ఈసారికి వదిలేయాల్సిందన్నాడు. హార్ధిక్ ను వైస్ కెప్టెన్ గా ఉంచి ఈసారికి రోహిత్ ను కెప్టెన్ గా కొనసాగించి ఉంటే బావుండేదన్నాడు. కానీ ఫ్రాంచైజీ అభిప్రాయాన్నికూడా తాను అర్ధం చేసుకోగలనన్నాడు. అయితే కెప్టెన్సీ మారినా ముంబై ఇండియన్స్ ఈసారి కూడా రాణిస్తుందని యువీ అంచనా వేస్తున్నాడు.












Click it and Unblock the Notifications