రాజకీయాలకు అతీతంగా రాహుల్
హైదరాబాద్: దేశంలో నెహ్రూ కుటుంబ రాజకీయ ఆధిపత్యం మీద ఎన్ని విమర్శలు ఉన్నా రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీకి ఉన్న ఆధునిక ఆలోచనా ధోరణి సీనియర్ నాయకుల ప్రశంసలకు పాత్రమౌతోంది. అయన ఇటీవల నిరుద్యోగం, దారిద్య్రంపై లోక్‌సభలో చేసిన ప్రసంగం కూడా అటువంటిదే. ఆయన మంచి హోం వర్క్ చేసి తొలిసారిగా లోక్‌సభలో మాట్లాడారు. దేశాభివృద్ధికి ఏ మార్గం అనుసరణీయమో రాహుల్ గాంధీ ఆ అన్వేషణలో ఉన్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ అగ్రనాయకులు, బిజెపి అగ్రనాయకుల మీద, వీరు వారి మీద, వీరు వారి మీద చేసుకుంటున్న అర్ధ రహిత ఆరోపణలు ఆలోచనాపరులకు విసుగు కలిగిస్తాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం, టిఆర్‌ఎస్ నాయకుల ఆరోపణలు కూడా అందుకు భిన్నం కావు.
ఇప్పుడు జాతీయ స్ధాయిలో కాంగ్రెస్ పార్టీకి ఆశాజ్యోతిగా ఉన్న రాహుల్ గాంధీ ఏ పదవి కోరుకున్నా ఆయనను వ్యతిరేకించే వారు ఉండరు. అయినా వినయం, దేశాభివృద్ధి కాంక్ష ఆయనలో ప్రబలంగా ఉన్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి గానీ ఆయన పార్టీలో ఒక ముఖ్యమైన పదవి తీసుకునే అవకాశాలు కన్పించడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ నాయకత్వంలో కాంగ్రెస్ రాష్ట్రంలో ఘన విజయం సాధించినప్పుడు ఆయన ఆనందించినప్పటికీ, చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో చాలా అభివృద్ధి జరిగింది. ఓడిపోయినంత మాత్రాన ఆయనను అవమానపరిచే వ్యాఖ్యలు చేయవద్దు అని రాహుల్‌గాంధీ చెప్పినప్పుడు తలలు పండిన రాజకీయ నాయకులు కూడా ఆయన రాజకీయ, మానసిక పరిపక్వత చూసి ఆశ్చర్యపడ్డారు. ముప్పై ఏళ్ళ యువకుడికి అంతటి విజ్డం ఉండడం విశేషమే.
వరంగల్ జిల్లాలో మహిళా స్వయం సహాయక గ్రూపుల పనితీరు బాగుందని, అక్కడ నిజమైన గ్రామీణాభివృద్ధి జరుగుతోందని గ్రహించిన రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గమైన అమేథీలో అటువంటి పథకాన్ని అమలు చేయాలని పట్టుదలగా ఉన్నారు. ఇందుకోసం ఆయన అమేథీ నుంచి ఏడుగురు సభ్యుల అధ్యయన బృందాన్ని అమేథీకి పంపించారు. వరంగల్ జిల్లాను సందర్శించిన బృందంలో రాహుల్‌గాంధీ వ్యక్తిగత కార్యదర్శి కనిష్కసింగ్ కూడా ఉండడం విశేషం. ఇక్కడి మహిళల స్వయం సహాయక గ్రూపులు సాధించిన ప్రగతిని చూసి ఆ బృందం ఆశ్చర్యపోయిందని వెలుగు కార్యక్రమం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టి.విజయ్‌కుమార్ చెప్పారు.












Click it and Unblock the Notifications
