మజ్జి శ్రీను జంప్ వెనుక సీటును మించి ఆ రెండు ! అందుకేనా బొత్స మామకు హ్యాండ్ ?
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు ఇన్నాళ్లూ క్షేత్రస్ధాయిలో అండగా ఉన్న మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (Majji Srinivasarao) తాజాగా టీడీపీలోకి ఫిరాయించారు. స్థానిక సంస్దల ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న ఈ పరిణామం తనతో పాటు కుమార్తె భవిష్యత్తు కోసమే అని అంతా భావిస్తున్న వేళ.. అంతకు మించిన కీలక కారణాలు దీని వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. అవే వైసీపీతో లింక్ అయిన రెండు కీలక కేసులు.
ఏపీలో వైసీపీ హయాంలో జరిగిందని భావిస్తున్న మద్యం అక్రమ రవాణా స్కాంపై దర్యాప్తు ఊపందుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అరెస్టు చేసి జైలుకు పంపింది. అయితే ఆయన కంటే ఎక్కువగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మజ్జి శ్రీనివాసరావు గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. అలాగే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడి కత్తి దాడిలోనూ మజ్జి శ్రీనివాసరావు పాత్రపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు కూడా ఇంకా విచారణ, కోర్టుల్లో కొనసాగుతోంది. ఈ రెండింటిలో ఏ ఒక్క కేసులో అయినా ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తే మజ్జి శ్రీనివాసరావు జైలు పాలయ్యే అవకాశాలున్నాయి. అందుకే ఆయన పార్టీ మార్పుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

తాజాగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న మజ్జి శ్రీనివాసరావు.. హఠాత్తుగా వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరిపోవడం వెనుక పెద్ద హోమ్ వర్కే జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా బొత్స సత్యనారాయణ జనసేనలోకి వెళ్తారంటూ కొందరు ప్రచారం మొదలుపెట్టారు. దీన్ని బొత్స కొట్టిపారేశారు. ప్రస్తుతం మండలిలో విపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ పార్టీ మార్పు మీద చర్చ జరుగుతున్న తరుణంలోనే మజ్జి శ్రీనివాసరావు లిక్కర్ కేసులో అరెస్ట్ కాకుండా టీడీపీలో చేరేందుకు వీలుగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఎలాగో బొత్స టార్గెట్ గా ఉత్తరాంధ్రలో పావులు కదుపుతున్న కూటమి.. మజ్జి శ్రీనును టీడీపీలో చేర్చుకుంటే ఆయనకు చెక్ పెట్టొచ్చని భావించింది. దీంతో ఏమాత్రం హడావిడి లేకుండా చంద్రబాబు వద్దకు కుటుంబంతో సహా బయలుదేరిన మజ్జి శ్రీను.. చివరి నిమిషంలో వైసీపీకి తన రాజీనామాను బయటపెట్టారు. గంటలో చంద్రబాబు వద్దకు వెళ్లి టీడీపీ కండువా కప్పేసుకున్నారు. దీంతో వైసీపీకి షాక్ తప్పలేదు.














Click it and Unblock the Notifications
