సిటీ మార్కు మిత్రభేదం
హైదరాబాద్: హైదరాబాద్ పరిసరాల్లో విపరీతంగా పెరుగుతున్న రియల్‌ఎస్టేట్ ధరలు తెలంగాణ రాష్ట్రం ఇప్పట్లో ఏర్పడదన్న బలమైన సంకేతాలను ఇస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందన్న సూచనలు వచ్చినప్పుడు తగ్గుతున్న ప్లాట్ల ధరలు చంద్రశేఖరరావు, నరేంద్ర మౌనం వహించినప్పుడల్లా విపరీతంగా పెరుగుతున్నాయి. స్టాక్‌మార్కెట్ ఇప్పటికే బాగా పెరిగిపోయినందువల్ల ఎన్నారైలు, వ్యాపారుల మిగులు నిధులు రియల్ ఎస్టేట్ వైపు పరుగులు తీస్తుండడంతో మియాపూర్ నుంచి షేక్‌పేట్ వరకు భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయ విమానాశ్రయం వస్తున్న షంషాబాద్ ఏరియాలో భూములు బంగారు గనులుగా మారాయి. హుడా వేలం వేస్తున్న భూముల ధరలు అయితే సామాన్యులు ఆశ్చర్యపోయేవిధంగా ఉన్నాయి.
నగరంలో భూముల ధరలు ఇప్పటికే బెంగుళూరు, చెన్నై రేంజికి చేరినప్పటికీ కొనుగోళ్ళలో మాంద్యం కన్పించడం లేదు. హుడా వేలం వేసే భూములు సురక్షితమైనవి కాబట్టి వీటికి అధిక ధరలు పలుకుతున్నాయి. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద గల ప్రభుత్వ స్ధలాన్ని ఇటీవల వేలం వేయగా గజం లక్షా నలభై వేల రూపాయలు పలకడం విశేషం. నందగిరిహిల్స్‌లో గజం భూమి విలువ 80 వేలకు పెరిగింది. కూకట్‌పల్లి జెఎన్‌టియు నుంచి హైటెక్ సిటీవరకు విశాలమైన రోడ్డు పడడంతో కుకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో కూడా భూముల ధరలు జూబిలీహిల్స్ ధరలతో సరిసమానంగా పలుకుతున్నాయి. హౌసింగ్‌బోర్డు ప్రాంతంలో మలేషియన్ సిటీ అభివృద్ధి కావడం, అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్లాట్లు తయారు కావడంతో చుట్టుపక్కల ధరలు బాగా పెరిగాయి.
హైదరాబాద్‌లో భూముల ధరల పెరుగుదల శాస్త్రీయమైనదేనని రియల్‌ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ఇతర పెట్టుబడులు ఆకర్షణీయంగా లేకపోవడంతో పెట్టుబడులు సహజంగా రియల్‌ఎస్టేట్ వైపు మళ్ళుతున్నాయని వీరి వాదన. ముఖ్యంగా ఎన్నారై పెట్టుబడులు భారీగా భూముల మీదికి వస్తున్నాయి.రియల్ ఎస్టేట్ బూమ్ మరికొంతకాలం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నగర శివారుల్లోని రైతులు తమ పొలాలను అమ్ముకోగా వస్తున్న లక్షలు, కోట్ల రూపాయలను ఎక్కడ పెట్టుబడులు పెట్టుకోవాలో వారికి అర్ధం కాకుండా ఉంది.












Click it and Unblock the Notifications
