బావమరిది సయ్యా!
హైదరాబాద్: అనుకున్నంతా అయ్యింది. బాలకృష్ణ రాజకీయ రంగ ప్రవేశంతో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ఆధిపత్యం తగ్గుతుందని చేసిన అంచనాలు నిజమవుతున్నాయి. బావమరిదే కాకుండా వియ్యంకుడు కూడా కావడంతో బాలకృష్ణ నుంచి తనకు ఎటువంటి నష్టం ఉండదని, పార్టీ లాభపడుతుందని చంద్రబాబు నాయుడు ఆశించారు. కానీ ఆయన అనుకున్నట్టుగా పరిస్ధితులు ఇప్పుడు పార్టీలో లేవు.
ఇప్పటివరకూ బాబు తెలుగుదేశం పార్టీలో ఒకే ఒక్కడు. బాలకృష్ణ నిన్న " కాలం కలిసోస్తే సిఎం అవుతా" అని రాజమండ్రిలో ప్రకటించడంతో చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. బాలయ్య ప్రకటన తెలుగుదేశం నాయకుల్లో కార్యకర్తల్లో సంచలనం సృష్టించింది. స్వతహాగా ఆవేశపరుడైన బాలకృష్ణ ఎవరితోనూ చర్చించకుండానే ఈ వ్యాఖ్య చేసి ఉన్నా ఆశ్చర్యం లేదు. గుంటూరు యువగర్జన సభలో తన ప్రసంగం సూపర్ హిట్ కావడంతో బాలయ్యకు రాజకీయాల మీద విశ్వాసం బాగా పెరిగింది. తన తండ్రి ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చడానికి చొరవ తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.
తూర్పు గోదావరి జిల్లాలో ఒక పక్క షూటింగ్ లో పాల్గొంటూనే మరో వైపు ఆయన స్ధానిక తెలుగుదేశం నాయకులతో చర్చింది వారిని ఉత్తేజపరచడానికి ప్రయత్నిస్తున్నారు. రాజమండ్రిలో నాయకులను కలుసుకోమని చంద్రబాబు నాయుడు చెబితే చెప్పి ఉండవచ్చు కానీ "కాలం కలిసొస్తే సిఎంను అవుతా" అని బాలయ్య అంటాడని చంద్రబాబు నాయుడు ఊహించి ఉండరు. "పార్టీ ఆదేశిస్తే అక్క పురందేశ్వరి మీద కూడా పోటీ చేయడానికి సిద్ధం" అని ఆయన ప్రకటించడం చంద్రబాబుకు, తెలుగుదేశం కేడర్ కు ఆనందం కలిగించే విషయమే.
"బాలయ్య బాబాయే కాబోయే ముఖ్యమంత్రి" అని హీరో తారకరత్న గతంలో చెప్పిన విషయాన్ని ఇప్పుడు బాలకృష్ణ స్వయంగా చేసిన వ్యాఖ్యలు బలపరుస్తున్నాయి. తారకరత్నతో హరికృష్ణే ఆ విధంగా చెప్పించారన్న అభిప్రాయం ఉంది. నాన్నగారి సొంత ఆస్ధి అయిన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడి గుత్తాధిపత్యం హరికృష్ణకు నచ్చడం లేదని, అయితే సోదరి భువనేశ్వరి మొహం చూసి ఆయన చంద్రబాబుతో సర్ధుకుపోతున్నారని చెబుతున్నారు. తమ్ముడు బాలకృష్ణ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ప్రవేశించడంతో హరికృష్ణ చకచకా పావులు కదుపుతున్నట్టు సమాచారం. బాలయ్యను ముఖ్యమంత్రిగా చూడాలన్నది అన్న హరికృష్ణ ఆరాటంగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడిని జాతీయ రాజకీయాల్లోకి పంపించి, ఇక్కడ బాలకృష్ణను ముఖ్యమంత్రిని చేయాలని అదే సామాజిక వర్గానికి చెందిన ముఖ్యులు మంతనాలు చేస్తున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications
