అదివో అల్లదివో కాంగ్రెస్ వాసమూ...

Nagarjuna
హైదరాబాద్: నాగార్జున ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి అనుకూలంగా ఆయనకు ప్రీతి పాత్రమైన పథకాలను పొగుడుతూ టీవీల్లో దర్శనమిస్తున్నాడు. రాజశేఖరరెడ్డి ఏడుకొండలవాడైతే, నాగార్జున అన్నమయ్యలా ఆయనకు సేవ చేస్తున్న అనుభూతి కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం యాడ్స్ ను రూపొందించింది. నాగార్జున చాలా తెలివైన వ్యాపారవేత్త. ఆయనలో కళాకారుడికంటే వ్యాపార వేత్త లక్షణాలు బాగా ఉన్నాయి.

పైకి సోషలైట్ గా కన్పిస్తూ, వ్యాపారానికి అనువైన రాజకీయ, సామాజిక వ్యూహాలను రూపొందించుకోవడంలో ఆయన దిట్ట. ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీకి అనుకూలంగా ఉండడంలో తప్పు లేదని, మంచి ఆరోగ్యానికి అదొక మంచి చిట్కా అని నాగార్జున రెండు మూడు నెలల క్రితం ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చక్కగా జుట్టు సవరించికుంటూ సెలవిచ్చారు.

నాగార్జున హైటెక్ సిటీ చుట్టుపక్కల వరి మాగాణి పొలాలను ఎప్పుడో ఇరవయ్యేళ్ళ క్రితం ఎకరం ముప్పై నలభై వేలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఊహించని రీతిలో ఆ ప్రాంతం హైదరాబాద్ కే తలమానికంగా తయారైంది. ఇప్పుడు ఎకరం ధర దాదాపు 30 కోట్లు పలుకుతోంది. నాగార్జున అదృష్టజాతకుడు అనడానికి ఆ భూముల ఉదంతం చాలు. మరి ఇప్పుడు అంత విలువైన భూములను కాపాడుకునే మార్గమేది? ఆదాయపు పన్ను శాఖ దాడులనుంచి మినహాయింపు పొందే దారేది. "అదివో అల్లదివో కాంగ్రెస్ వాసమూ" అని పాడుకోవడం తప్ప మరో మార్గముందా?

ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినా నాగార్జునకు వచ్చే నష్టం ఉండదు. ఎందుకంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడినో, కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఏ మహానాయకుడినో ఆయన ఆశ్రయించగలరు. వ్యాపార ప్రయోజనాల ముందు కులం పెద్దది కాదన్న విషయం ఇక్కడ స్పష్టమవుతోంది.

చిరంజీవితో కలిసి అనేక వ్యాపారాలు నాగార్జున చేశారు. కోకాపేటలో ఇద్దరూ కలిసి ఎకరాల్లో భూములు కొన్నారు. కొన్నదానికి కొన్ని వందల రెట్లు లాభం పొందారు. మాటీవీలో ఇద్దరూ కొంత కాలం భాగస్వాములు. చిరంజీవి మాటీవీ నుంచి పూర్తిగా బయటికి రాగా నాగార్జున స్టేక్ ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

నాగార్జున జెంటిల్మన్ అనడంలో సందేహం లేదు. ఆయన తన స్వప్రయోజనాలను ఇతరులకు ఎవరికీ ఇబ్బంది పెట్టని రీతిలో చూసుకుంటే ఎవరూ తప్పు పట్టనవసరం లేదు. అయితే చిరకాల మిత్రుడు, వ్యాపారాల్లో భాగస్వామి అయిన చిరంజీవి సొంతంగా పార్టీ పెట్టుకుని ఎండనకా చలి అనకా అలా తిరుగుతుంటే, నాగార్జున వైఎస్ పక్షం వహించడం దేనికి సంకేతం? చిరంజీవి అధికారంలోకి రారన్న అనుమానం నాగార్జునకు ఉందా? రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరం చెప్పలేం.

కొసమెరుపు: 2004 ఎన్నికల్లో నాగార్జున తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా టీవీ యాడ్స్ లో నటించారు. కొత్త ఓటర్లు నమోదై రాష్ట్ర రాజకీయాలను హైటెక్ (చంద్రబాబు) దిశగా మళ్ళించాలన్నది ఆనాడు ఆయన సందేశం. అప్పుడు తెలుగుదేశం చిత్తుగా ఓడిపోయింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పరిస్ధితీ అంతేనా?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+