పురందేశ్వరికి బహిరంగ లేఖ

1. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రెండు ప్రధాన పార్టీల్లో ఉండి ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటూ, జనాన్ని అయోమయంలో పడేస్తూ, తమ కుటుంబ ప్రయోజనాలను మొత్తంగా కాపాడుకోవడం లేదా? ఈ చిత్ర విచిత్రానికి జనంలో లో జంగయ్యలు మౌన ప్రేక్షకులు కావాలా?
2. ఎన్టీఆర్ వెన్నుపోటు ప్రక్రియలో వైస్రాయ్ కి వెళ్ళి, లక్ష్మీపార్వతి రాజ్యం పోయేలా చేయమని భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వీర తిలకం పెట్టి పంపిన ఘనత పురందేశ్వరిది కాదా? చంద్రబాబు నాయుడు అన్న హరికృష్ణకు, భర్త దగ్గుబాటికి కూడా వెన్ను పోటు పొడిచిన తర్వాత కానీ ఈ చిన్నమ్మకు ఈ పెద్ద విషయాలు తెలియలేదా?
3. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున చిలక పలుకులు పలుకుతున్న పురందేశ్వరికి తన తండ్రి జీవితాంతం కాంగ్రెస్ వ్యతిరేకించిన విషయం తెలియదా? కాంగ్రెస్ పేరు ఎత్తితే ఆయన సమాధి నుంచి లేచి ఆగ్రహిస్తారన్న భయం పురదేశ్వరికి బోధపడలేదా? లేదా ఆమె "మన కుటుంబం వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వెలుగులో ఉండాల"ని ఎన్టీఆర్ అనుకుంటారన్న అంతర్గత సత్యాన్ని నమ్ముతున్నారా?
4. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులైన మీరు పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు గల పార్టీల్లో ఉండి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉమ్మడిగా వెలిగిపోదామనుకుంటున్నారా?
5. ఈ జనంలో జంగయ్య అడిగేదేమిటంటే, మీ భర్త డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో ఆనాటి వైస్రాయ్ డ్రామా గురించి సవివరమైన ప్రకటన చేయించగలరా? అలా చేయిస్తే మీ చిత్తశుద్ధిని మేం నమ్ముతాం
6. సమాజంలో కింది వర్గాల వారిమైన మేం ఎంత వరకు మీ కుటుంబ సభ్యులు ఏ పార్టీలో ఉన్నా దివ్యంగా వెలిగిపోవాలని కోరుకోవాలా మరి కొన్ని తరాల వరకు?
7. చంద్రబాబు నాయుడే గనుక మీ భర్తకు పార్టీ నాయకత్వం అప్పగించి, తాను ముఖ్యమంత్రిగా మిగిలిపోయి ఉంటే మీకు చంద్రబాబు నాయుడు దేవుడిలా కన్పించి ఉండేవారు కాదా?
8. మీ సామాజిక వర్గానికి చెందిన వారు ఐదేళ్ళ క్రితం తెలుగుదేశం ఓడిపోతోందన్న విషయాన్ని ముందే పసిగట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆనాడు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పనిచేసి మీలాంటి వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించిన మీ సామాజిక వర్గానికి చెందిన వారు ఇప్పుడేం చేస్తున్నారో మీకు తెలియదా? నిన్న యువగర్జనకు వాహనాల్లో జనాన్ని తరలించిన వారు వారే కదా?
9.ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఎంపీగా గెలువగలనన్న నమ్మకం మీకుందా? మీ వాళ్ళే మిమ్మల్ని గెలవనిస్తారా?
10. సరే, జనంలో జంగయ్యలం, జనంలో జంగమ్మలమైన మాకు కాంగ్రెస్ గెలిచినా, తెలుగుదేశం గెలిచినా ఒకటే. మా దొడ్డు బియ్యం అన్నం తింటూ గొడ్డు చాకిరి చేయాల్సిన వాళ్ళమే.
11. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో కూడా మీ లాంటి పెత్తందార్లే చొరబడుతున్నారు. అక్కడ కూడా మా జంగయ్యలకు, జంగమ్మలకు ప్రాధాన్యం లేదు. మేం ఎంత వరకు ఓటర్లుగా మిగిలిపోవలసిందేనా?
12. అమ్మా! చిన్నమ్మా! పురందేశ్వరమ్మా! చంద్రబాబు నాయుడు ఒకవేళ అధికారంలోకి వస్తే, మీకుటుంబ ప్రయోజనాలను తాత్కాలికంగా అయినా పక్కకు పెట్టి మా గురించి పట్టించుకోమని చెప్పమ్మా! ఎంత కాదన్నా మీరంతా ఒకే కుటుంబ సభ్యులు కదా. ఆ మాత్రం స్వతంత్రం మీకు ఉండదా? మీ తండ్రి గారి ఆత్మశాంతి కోసమైనా ఈ బడుగుల గురించి ఆ పని చేసి పెట్టమ్మా!












Click it and Unblock the Notifications