కెసిఆర్ కు బాబు వెన్నుపోటు?

చంద్రబాబుకు రాష్ట్ర రాజకీయాల్లో అపర చాణక్యుడనే పేరుంది. ఆ అపర చాణక్యాన్ని వ్యూహరచనలో ఆరితేరిన కెసిఆర్ ను బుట్టలో వేయడంలో కూడా ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము అనుకూలమని, తెరాసతో పొత్తు తమకు అత్యంత ప్రధానమని చెబుతూనే తెరాస వెన్ను విరిచే పనికి ఆయన ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబుది అందే వేసిన చేయి అని మరోసారి రుజువు చేసుకున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.
నిజానికి, హుజూర్ నగర్ వంటి రెండు మూడు స్థానాలు తప్ప తెరాసకు కేటాయించిన చాలా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ బలం కూడా అంతంత మాత్రమే. ముషిరాబాద్, కూకట్ పల్లి, ఉప్పల్ వంటి స్థానాల్లో తెలుగుదేశం గానీ దాని మిత్రపక్షమైన సిపిఎం గానీ బలంగా లేదు. ముషిరాబాద్ తెరాస అభ్యర్థి నాయని నర్సింహారెడ్డి కెసిఆర్ కు అత్యంత సన్నిహితులు. అటువంటి స్థానాలకు కూడా చంద్రబాబు ఎసరు పెట్టి కెసిఆర్ కు కక్కలేని మింగలేని పరిస్థితిని కల్పించారని అంటున్నారు. మహబూబ్ నగర్ లోకసభ స్థానానికి తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డితో కలిసి కెసిఆర్ వెళ్లిన మరు క్షణమే తన మోసపూరిత రూపాన్ని చంద్రబాబు ప్రదర్శించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తనకు బలం ఉన్న పాలకుర్తి వంటి సీట్లను నిజానికి తెరాస త్యాగం చేసింది. తెలుగుదేశం పార్టీకి గానీ, వామపక్షాలకు గానీ బలం లేని నాంపల్లి వంటి పలు సీట్లను తెరాస తీసుకుని పోటీకి సిద్ధపడింది.
చంద్రబాబుకు తోడు ఈ నాటకంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు కూడా తన వంతు పాత్ర నిర్వహించినట్లు చెబుతున్నారు. మహా కూటమి ఏర్పాటుతో కాంగ్రెసును ఓడించడానికి తాము కొన్ని సీట్లను త్యాగం చేయడానికి కూడా తాము సిద్ధమేనని రాఘవులు మొదటి నుంచీ చెబుతూ వచ్చారు. చివరకు సర్దుబాటు సమయంలో తన పంజా విప్పారు. తెలుగుదేశం పార్టీతో విభేదిస్తున్నట్లు, తాము మరిన్ని సీట్లకు పోటీ చేయడానికి సిద్ధపడుతున్నట్లు ఒక గందరగోళమైన వాతావరణాన్ని సృష్టించి తెలుగుదేశం నాటకానికి తోడ్పడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications