వైఎస్ ప్రమాదకర క్రీడ!

ఐదేళ్ళ క్రితం తెలుగుదేశం ఇలాగే విశాలాంధ్ర వాదాన్ని విన్పించింది. తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా, టీఅర్ ఎస్ తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కు ఆంధ్ర, సీమల్లో ఎదురుదెబ్బ తప్పదని ఆశించింది. కానీ అవేమీ ఆంధ్రా, సీమల్లో పనిచేయలేదు. వేర్పాటువాద శక్తులతో కలిసినా కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్రప్రదేశ్ కు కట్టుబడగా, తెలుగుదేశం తెలంగాణ వేర్పాటు వాద పార్టీ టీఆర్ ఎస్ తో జత కలిసింది. ఐదేళ్ళలో ఈ రెండు పార్టీల అగ్ర నాయకులు ప్లేట్లు ఫిరాయించి ఒకరి పాత్రను మరొకరు తీసుకున్నట్టయింది.
తెలంగాణ రాష్ట్రం వస్తే, హైదరాబాద్ లో మనం జీవించలేమంటూ వైఎస్ రాయలసీమలో, కోస్తా ఆంధ్రలో చేస్తున్న ప్రచారం ఆయనకు మంచి ఫలితమిస్తుందా? మొదటి విడత జరిగిన తెలంగాణ పోలింగ్ లో కాంగ్రెస్ బాగా వెనుకబడినందువల్లనే వైఎస్ ఆంధ్ర, రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నారా? ఒక వేళ ఆ పథకం బెడిసికొడితే ఏమవుతుంది? పథకం పారితే పర్యవసానమేమిటి? ఈ పథకం ఫలించి వైఎస్ నాయకత్వంలోని ఆంధ్ర, సీమల్లో వందపైన సీట్లు గెలుచుకుంటే మరో ఐదేళ్ళ పాటు రాష్ట్రం వైఎస్ ఇష్టారాజ్యమవుతుంది. కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావచ్చేమో కానీ అవినీతి ఇంకా కట్టలు తెంచుకుని వికటాట్టహాసం చేస్తుంది.
మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రంలో వత్తిడి తేవలసి ఉంటుంది. కేంద్రంలో వారికి అనుకూలమైన కూటమి అధికారంలోకి రాకపోతే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం సుదూర స్వప్నమే. ఆంధ్ర, సీమ వాసులను వైఎస్ రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నా అవి ఫలించే అవకాశాలు కన్పించడం లేదు. హైదరాబాద్ లో వ్యాపారాలు ఉన్నవారికి తప్ప, కోస్తా, సీమ జిల్లాల్లో ఉంటున్న వారికి హైదరాబాద్ మీద మమకారం ఉండే అవకాశం లేదు. పైగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్, తదితర వ్యాపారాలు చేసుకుని బాగు పడిన వారి మీద కోస్తా, సీమ ల్లోని మెజారిటీ సామాన్య జనానికి అసూయ కావచ్చు, సకారణ ద్వేషం కావచ్చు, వ్యతిరేకత అయితే ఉంది. అటువంటప్పుడు వైఎస్ పాచిక ఈ రెండు ప్రాంతాల్లో పారే అవకాశం కన్పించడం లేదు.
ఈనాడు నేడు రాసిన కథనాల ప్రకారం తెలంగాణలో, ఉత్తరాంధ్రలో మహాకూటమి వందకు పైగా స్ధానాల్లో గెలుస్తుంది. సాక్షి రాసినదాని ప్రకారం తొలి విడతలో కాంగ్రెస్ సెంచరీని దాటిపోయినట్టే. ఈ విషయంలో ఆంధ్రజ్యోతి కొంచెం బ్యాలెన్స్ పాటించినట్టు కనిపిస్తోంది. అయినా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? పత్రికా కథనాలకు సామాన్యుల ఓట్లు వచ్చి పడతాయా? ఫలితం కోసం ఇంకో నెలరోజులు వేచి చూడక తప్పదు.












Click it and Unblock the Notifications