వైయస్ జగన్ కు తెలియదా?

తమకు, తమ రాజకీయ నాయకులకు అనుకూలమైన వార్తలనే కాకుండా ప్రత్యర్థులకు వ్యతిరేకమైన వార్తాకథనాలను రాయడానికి సంస్థల్లో యాజమాన్యాలు ప్రత్యేకంగా సీనియర్ జర్నలిస్టులను నియోగించుకుంటున్నాయి. రిపోర్టర్లు రాసే వార్తాకథనాలను చెత్తబుట్ట దాఖలు చేయడమో, మార్చేయడమో కూడా చేస్తున్నాయి. పత్రికల్లో వార్తా ప్రాధాన్యతలను కూడా యాజమాన్యాలే నిర్దేశిస్తున్నాయి. సంపాదకులు కేవలం యాజమాన్యాల కింద కేవలం కీలుబొమ్మలుగా మారిపోయారు. స్వతంత్రంగా ఆలోచించి, వాస్తవాల ఆధారంగా, హేతుబద్ధంగా పనిచేసే జర్నలిస్టులకు ఇప్పుడు తెలుగు మీడియాలో స్థానం లేకుండా పోయింది.
ఇటువంటి స్థితిలో వైయస్ జగన్ కు తెలియకుండా సోనియాకు వ్యతిరేకంగా వార్తాకథనం వచ్చిందంటే ఎవరూ నమ్మబోరు. అయితే, వైయస్ జగన్ అనుచరులే కాకుండా సాక్షి టీవీ టానెల్ సిఇవో రామ్ మాత్రం వైయస్ జగన్ కు తెలియకుండానే వార్తాకథనం వచ్చిందని చెబుతున్నారు. వైయస్ జగన్ తన మీడియాలో పనిచేసే జర్నలిస్టులకు స్వేచ్ఛనిచ్చారని చెప్పే ప్రయత్నం సాక్షి మీడియా ప్రతినిధులు చేస్తున్నారు. ఈ మీడియా ప్రతినిధుల ప్రయత్నాలు కూడా వైయస్ జగన్ కనుసన్నల్లోనే నడుస్తాయనడంలో సందేహం లేదు. తన రాజకీయ ప్రయోజనాలకు, రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగానే వైయస్ జగన్ కు చెందిన మీడియాలో సోనియా వ్యతిరేక కథనాలు వచ్చాయని చెప్పవచ్చు.
ఇప్పుడు ఒక్కో పార్టీకి ఒకటో రెండో మీడియా సంస్థలున్నాయి. స్టూడియోఎన్ తెలుగుదేశం పార్టీకి, రాజ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర సమితికి, సాక్షి వైయస్ జగన్ కు అనుకూలమనే విషయం అందరికీ తెలిసిందే. ఇందులో సందేహించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. మిగతా మీడియా సంస్థలు కూడా ఏదో ఒక పార్టీకో, నాయకుడికో అనుకూలంగానే పనిచేస్తున్నాయనేది కూడా కాదనలేని సత్యం. తామెంత నిష్పక్షపాతంగా వార్తాకథనాలు ఇస్తున్నామని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒకే వార్త వేర్వేరు మీడియాలో వేర్వేరుగా రావడం కూడా చూడవచ్చు. ఇదంతా యాజమాన్యాల రాజకీయ వైఖరులు, నిబద్ధతల వల్లనే జరుగుతోందని తెలుసు. అందువల్ల సోనియాపై వచ్చిన వ్యతిరేక కథనం గురించి వైయస్ జగన్ కు తెలియదని చెప్పడం వృధా ప్రయాసే అవుతుంది.












Click it and Unblock the Notifications