తెలంగాణ రాష్ట్రం ఇస్తారా?

డిసెంబర్ 31వ తేదీలోగా నివేదిక సమర్పిస్తామని శ్రీకృష్ణ కమిటీ అంటోంది. ఆ నివేదికపైనే ఇరు ప్రాంతాల్లోనూ ఉత్కంఠ నెలకొని ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకపోతే మధ్యేమార్గం తెలంగాణవారికి ఆమోదయోగ్యంగా ఎలా ఉంటుందనేది చెప్పడానికి వీలు కాకుండా ఉంది. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వంటి సమైక్యవాదులు కూడా శ్రీకృష్ణ కమిటీ ఆమోదయోగ్యమైన నివేదిక ఇస్తుందని ఆశిస్తున్నారు. సీమాంధ్ర నాయకులు పలువురు లగడపాటి పద్ధతిలోనే మాట్లాడుతున్నారు. అంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కమిటీ నివేదిక ఉండదేమోననే సందేహం తెలంగాణ ప్రాంతంలో నెలకొని ఉంది.
తమకు అనుకూలంగా శ్రీకృష్ణ కమిటీ ఉంటుందని తెలంగాణ నాయకులు కూడా అంటున్నారు. అయితే, శ్రీకృష్ణ కమిటీని తెలంగాణ ప్రాంత నాయకులు గానీ ప్రజలు గానీ పూర్తిగా నమ్మడం లేదు. దీంతో డిసెంబర్ తర్వాత తాము చేపట్టబోయే ఆందోళనలకు ఇప్పటి నుంచే వ్యూహరచనలు చేస్తున్నారు. డిసెంబర్ తర్వాత భూకంపం సృష్టించడానికి సిద్ధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కెసిఆర్ పదే పదే పిలుపునిస్తున్నారు. ఇటువంటి కమిటీలను, ఒప్పందాలను తెలంగాణ ప్రజలు చాలా చూశారు. అవేవీ తమకు అనుకూలంగా లేకపోవడాన్ని వారు అనుభవించారు. అందువల్ల శ్రీకృష్ణ కమిటీపై తెలంగాణలో అంతగా నమ్మకం కనిపించడం లేదు. అయితే, శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు అనుకూలంగా సిఫార్సు చేస్తుందని, తమ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే బలమైన విశ్వాసం వ్యక్తం కావడం లేదు.












Click it and Unblock the Notifications