కెసిఆర్ వ్యూహాత్మక మౌనం

K Chandrasekhar Rao
తన మీదికి ముంచుకొస్తుందనుకుంటే మాటల తూటాలు విసరడం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు అలవాటు. కానీ, గద్దర్ ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ పై ఆయన మౌనం వహిస్తున్నారు. దీనికి కారణమేమిటనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇంతకు ముందు ఎ నరేంద్ర తెలంగాణ సాధన సమితిని, దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీని స్థాపించినప్పుడు ఆయన ఆహ్వానించారు. అలాంటి ఆహ్వానం కెసిఆర్ గద్దర్ కు పలకడం లేదు. ఎందుకనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. గద్దర్ ఏర్పాటు చేసే తెలంగాణ ప్రజా ఫ్రంట్ పై మాట్లడడానికి ఆయన నిరాకరించారు కూడా. గద్దర్ ఫ్రంట్ తనకు నష్టం చేస్తుందనే విషయం కెసిఆర్ కు స్పష్టంగా తెలుసు. తనను బలహీనపరుస్తుందనే ఎరుక కూడా ఆయనకు ఉంది. అయితే, గద్దర్ ఫ్రంట్ పై కెసిఆర్ వ్యూహాత్మకంగానే మౌనం వహిస్తున్నారని అర్థమవుతోంది.

ఒక్క మాటలో గద్దర్ ఫ్రంట్ ను ఆహ్వానించడం గానీ వ్యతిరేకించడం గానీ ప్రస్తుత వాతావరణంలో కుదరదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. గద్దర్ ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ వెనక ఉన్న శక్తుల గురించి ఆయనకు సమాచారం కూడా ఉందని అంటున్నారు. అందువల్ల కూడా ఆయన మౌనంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. తన అగ్రకులాన్ని వేలెత్తి చూపుతూ ఆ ఫ్రంట్ ముందుకు వస్తోంది. దాన్ని ఆలంబనగా చేసుకుని తెలుగుదేశం పార్టీ కెసిఆర్ పై ఎదురుదాడికి దిగుతోంది. ఆ పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. కాగా, కాంగ్రెసు కూడా ఏదో మేరకు గద్దర్ ఫ్రంట్ పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కెసిఆర్ ను బలహీనం చేయడానికి అది పనికి వస్తుందనేది కాంగ్రెసు తెలంగాణ నాయకుల అభిప్రాయంగా తోస్తోంది.

తనను చుట్టుముట్టబోతున్న పార్టీల గురించి, శక్తుల గురించి కెసిఆర్ కు పూర్తి అవగాహన ఉందని అంటున్నారు. అందువల్ల తనంత తానుగా గద్దర్ పై గానీ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ పై గానీ వ్యాఖ్యలు చేయడానికి ఆయన సిద్ధంగా లేరని సమాచారం. తెలంగాణవారి నుంచే విమర్శలను, ఆరోపణలను ఎదుర్కోవడం కెసిఆర్ కు కొత్తేమీ కాదు. ఇంతకు ముందు సంస్థలు, పార్టీలను చూసిన అనుభవం ఉంది. ఏది కూడా ఆయన ముందు బతికి బట్ట కట్టలేదు. ప్రజా ఫ్రంట్ మాత్రం అందుకు కొంచెం భిన్నంగానే కనిపిస్తోంది. కొద్ది రోజులు ఆగితే తప్ప దాని భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే అంచనా రాదు. ఆ క్రమంలో ప్రజా ఫ్రంట్ నేతలు తనపై బాణాలు ఎక్కుపెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. అది కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ ఫ్రంట్ నాయకుల వైఖరిని, ధోరణిని బట్టి వ్యవహరించాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. అంతదాకా ఆగకుండా తొందరపడితే నష్టం తనంత తానుగా కొని తెచ్చుకోవడమే అవుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు తన వెంట ఉన్న శక్తులేవీ అటు వైపు వెళ్లే అవకాశాలు లేవని కూడా ఆయన ఒక అంచనాతో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+