వైయస్సార్ వీరతాళ్లు

వైయస్సార్ ఉన్నంత కాలం తెలుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు గుండెల్లో దడ పుట్టించారు. తెలుగుదేశం పార్టీని, తెరాసను తుడిచిపెట్టేందుకు ఆయన పథకం రచించి అమలు చేయడం ప్రారంభించారు. ఈ రెండు పార్టీల నుంచి నాయకులను కాంగ్రెసు పార్టీలోకి పెద్ద యెత్తున రప్పించేందుకు ప్రయత్నించారు. తెరాసలో పెద్ద ముసలమే పుట్టించారు. తెలుగుదేశం పార్టీలోని నాయకులను పెద్ద యెత్తున ఆకర్షించారు. ఆయన జీవించి ఉంటే ఆ రెండు పార్టీల ఉనికి ఉండేదా, లేదా అనే ప్రశ్న ఇప్పటికీ తలెత్తుతూనే ఉన్నది.
తన విధేయులను ఆయన నిరంతరం కాపాడుకుంటూ వచ్చారు. వారిపై ఆరోపణలు వచ్చిన సందర్బాల్లో విష్ణుచక్రం అడ్డు వేసేవారు. ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలను అంతకన్నా తీవ్ర స్థాయిలో తిప్పికొడుతూ వచ్చారు. పార్టీలోని ప్రత్యర్థుల నోళ్లు మూయిస్తూ వచ్చారు. దీంతో రాష్ట్ర కాంగ్రెసుకు తిరుగులేని రథసారిథిగా నిలిచారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ నామమాత్రంగా మిగిలారు. ప్రజల కోసం ఊపిరి సల్పకుండా సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ వచ్చారు. ఆరోగ్యశ్రీ, పింఛన్లు, రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి పలు సంక్షేమ పథకాలను ఆయన అమలు చేశారు. తద్వారా ప్రజల ఆదరణను చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వచ్చారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని కార్పొరేట్ ఆస్పత్రుల కోసమేనని విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. ఆయన ఆకస్మిక మరణంతో రాష్ట్ర రాజకీయాలు అల్లకల్లోలంగా మారాయి. ఏడాది దాటినా అవి కొలిక్కి రావడం లేదు.












Click it and Unblock the Notifications