బాలయ్యకు అంత సీన్ ఉందా?

పరిస్థితులు చూస్తుంటే సత్తాను పక్కన పెడితే బాలకృష్ణకు ఆ అవకాశం రాదనే విషయం అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలను తన చేతుల్లో ఉంచుకున్నంత వరకే కాదు, ఆ తర్వాత కూడా ఆయనకు అవకాశం లభించే పరిస్థితి లేదు. చంద్రబాబు ఏదో విధంగా తన కుమారుడు నారా లోకేష్‌కే తన వారసత్వాన్ని అప్పగించేందుకు ప్రయత్నిస్తారని చెప్పడంలో సందేహం లేదు. నారా లోకేష్‌ను వ్యతిరేకించి పార్టీని తన చేతుల్లోకి తీసుకునే సాహసం బాలయ్య చేయలేరనేది సత్యం. తన కూతురు బ్రాహ్మణిని లోకేష్‌కు ఇచ్చి వివాహం జరిపినప్పుడే ఆ అవకాశాన్ని ఆయన కోల్పోయారు.
మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు పోటీ వస్తున్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు వారసత్వాన్ని స్వీకరించేందుకు ఆయన పోటీ పడుతున్నారు. ఇందుకు జూనియర్ ఎన్టీఆర్ బాలయ్యను వ్యతిరేకించడానికి కూడా వెనకాడబోరని అర్థమవుతూనే ఉన్నది. ఇప్పటికే వీరిరువురి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. లోకేష్ నాయకత్వ విషయంలోనే ఈ విభేదాలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. నటనలోనూ జూనియర్ ఎన్టీఆర్ బాలయ్యతో పోటీ పడేందుకు సిద్ధపడ్డారు. ఏమైనా, బాలకృష్ణ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసే పనిముట్టుగా మాత్రమే ఉండిపోవాల్సిన పరిస్థితులున్నాయి.