• search
  • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్‌కు ఓటమి భయం పట్టుకుందా?

By Srinivas
|

YS Jagan
పులివెందుల, కడప ఉప ఎన్నికలను మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని శాయశక్తులా తమ తమ పార్టీ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో ఒకరిది సెంటిమెంట్ అస్త్రం కాగా, మరొకరిది అభివృద్ధి, సాంప్రదాయ ఓటింగ్ అస్త్రం, వేరొకరిది ప్రత్యర్థి చీలి పోవడంతో గెలుపు ఉంటుందనే ఆశ. ఇలా ఏ పార్టీ ఆ పార్టీ తమ గెలుపు ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే గెలుపుపై జగన్ వర్గం అతి విశ్వాసంతో ఉండగా, కాంగ్రెసు, టిడిపిలు మాత్రం ఆశాభావంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజుల్లో కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలు పూర్తి ఏకపక్షంగా ఉంటాయన్న ప్రచారం జరిగింది. ఈ ప్రచార హోరు నుంచి గట్టి పోటీని ఇస్తున్నామన్న ధీమాను వ్యక్తం చేసే స్థాయికి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు క్రమంగా ఎదిగారు.

కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలో దిగిన కడప లోక్‌సభ అభ్యర్థి డిఎల్ రవీంద్రారెడ్డి, పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి విజయం కోసం పట్టుదలతో పనిచేస్తున్నారు. ఇదే సమయంలో టిడిపి తరఫున రంగంలోకి దిగిన కడప లోక్‌సభ అభ్యర్థి ఎంవి మైసూరా రెడ్డి, పులివెందుల అసెంబ్లీ అభర్థి బిటెక్ రవి కూడా తమ విజయం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతర్గత కలహాలు లేకుండా తమ శ్రేణులను కాపాడుకుంటూ ముందుకు సాగడం ఈ రెండు పార్టీలకూ కలసి వచ్చే అంశం. అయితే అదే సమయంలో జగన్ వర్గం మాత్రం అంతర్గత కుమ్ములాటలో మునిగి పోయినట్లుగా తెలుస్తోంది. డబ్బుల పంపకం కారణంగా ఓ ముఖ్య ఎమ్మెల్యే అసంతృప్తికి గురి కాగా, స్థానికేతరులు కడప, పులివెందులలో పెత్తనం చెలాయించడం స్థానిక జగన్ వర్గం నేతలకు నచ్చక పోవడం మరో వైపు అంతర్గత సమస్యలకు దారి తీసింది.

ఇక కాంగ్రెసు పార్టీ తరఫున చిరంజీవి ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారానికి జనం హాజరు బాగా ఉండడంతో అధికార పార్టీలోనూ ఉత్సాహం పెరిగింది. ఆఖరి నిమిషంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన మూడు సభల్లో చేసిన ప్రసంగాలకు మంచి స్పందనే వచ్చింది. రోజుకో ప్రకటన చేస్తూ చిత్తచాపల్యాన్ని ప్రదర్శించకుండా ప్రభుత్వాన్ని పడగొడతావో నిలబెడతావో ఏదో ఒకటి తేల్చుకోవాలంటూ జగన్‌ను కిరణ్ సవాల్ చేయడం ముఖ్యమైన అంశంగా మారింది. ఇక టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కడప లోక్‌సభ పరిధిలో చేపట్టిన రోడ్‌షోలు విజయవంతమై ఆపార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపడమే కాకుండా కార్యకర్తల్లో చలనం తీసుకురాగలిగాయి. రెండు ఎద్దుల భీకర పోరులో లేగ దూడ కూడా విజయం సాధించే అవకాశాలు లేకపోలేదన్న చందంగా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న బీటెక్ రవి తాను విజయం సాధిస్తానన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఉప ఎన్నికలకు సంబంధించి ముందుగానే కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుని వ్యూహాత్మకంగా ముందుకు సాగిన జగన్‌లో చివరి నిమిషంలో కొంత ఆత్మస్థయిర్యం దెబ్బతిన్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలి రోజుల్లో నువ్వు ఎన్నికల్లో తిరిగితే తిరిగావు. కానీ నీ తల్లి విజయలక్ష్మి చేత రాజీనామా చేయించి ఆమెను ఎర్రని ఎండలో ఎందుకు తిప్పుతున్నావ్ అంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించినప్పుడు సమాధానం ఇవ్వని జగన్ ఇప్పుడు మాత్రం అందరికీ అన్నం పెట్టే తల్లి ఇప్పుడు ఓట్ల కోసం ఊరూరా తిరుగుతోంది అంటూ సానుభూతిని సొమ్ము చేసుకునే ప్రయత్నాలను మొదలెట్టిన వైనంపై వైరి పార్టీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. బిజెపితో అవగాహన అంశం కూడా జగన్‌ను దెబ్బతీస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే జగన్ గెలిచినా గతంకన్నా తక్కువ మెజార్టీ వస్తే ఆయన ఇమేజ్ పడిపోయినట్టేనని పలువురు భావిస్తున్నారు.

పోలింగ్ సమీపించే కొద్దీ జగన్‌లోని లోపాలు బయటపడుతున్నాయని మంత్రి ఒకరు అన్నారు. పులివెందుల నుంచి బరిలో ఉన్న వివేకానందరెడ్డి గట్టి పోటీ ఇస్తుండడంతోనే సెంటిమెంట్ అనే రాజకీయ ఎత్తుగడకు జగన్ కుటుంబం దిగిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇక నియోజకవర్గాల వారీగా పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్ నియోజకవర్గాల్లో తమకు భారీ మెజారిటీ వస్తుందని జగన్ అంచనాలు వేస్తున్నారు. మైదుకూరు, కడప, కమలాపురం, పులివెందులలో తాము ఆధిక్యతను సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరులపై తెలుగుదేశం నేతలు ధీమాతో ఉన్నారు. మరో వైపు తాను పులివెందులలో విజయం సాధిస్తానని తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి చెబుతున్నారు. కడప లోక్‌సభ పరిధిలో తనకున్న మంచి పేరే గెలిపించి తీరుతుందన్న విశ్వాసంతో మైసూరా రెడ్డి ఉన్నారు.

English summary
It seems, Ex MP YS Jaganmohan Reddy is afraid of by election. Congress and TDP speed campaign attracted voters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X