సవాళ్లు విసురుకుంటున్న టిఆర్ఎస్, టిడిపి

తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తెలంగాణ కోసం గత నెల 4వ తారీఖున రాజీనామా చేసిన అనంతరం తమ రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని భావించారు. అయితే స్పీకర్ రాజీనామాలు తిరస్కరించడం, టిడిపి అసమ్మతి శాసనసభ్యులు మళ్లీ రాజీనామాలు సమర్పించడం, టిఆర్ఎస్ ఎప్పుడంటే అప్పుడు రాజీనామాలకు సిద్ధం అని ప్రకటించడంతో టిటిడిపి పరిస్థితి మళ్లీ సందిగ్ధంలో పడింది. అయితే రాజీనామాలు చేయాలన్న టిఆర్ఎస్, జెఏసి డిమాండుపై టిటిడిపి ఎదురు దాడికి దిగింది. పక్కా వ్యూహం రచించి రాజ్యాంగ సంక్షోభం సృష్టించడానికి అయితే రాజీనామాలు చేస్తాం కానీ ఉప ఎన్నికల కోసం అని ఎదురు దాడికి దిగింది. రాజీనామా చేసిన వారికే టిక్కెట్లు ఇవ్వాలనే కండిషన్ పెట్టారు. అంతేకాదు రాజీనామాలు చేసిన తర్వాత మళ్లీ ఎవరూ ఎన్నికలలో పోటీ చేయవద్దని వాదననూ తెరపైకి తీసుకు వచ్చారు. రాజీనామా చేయడం తిరిగి వాళ్లే పోటీ చేసి గెలవడంలో అర్థం లేదని టిటిడిపి వాదించడంతో టిఆర్ఎస్ ఆత్మసంఘర్షణలో పడింది.
దీంతో తెలంగాణకు అనుకూలంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో కేంద్ర మంత్రి చిదంబరంకు లేఖ ఇప్పిస్తే రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలనే పోటీ చేయిస్తామనే వాదనతో టిఆర్ఎస్ ముందుకు వచ్చింది. దీంతో బాల్ మళ్లీ టిడిపి కోర్టులో పడింది. చంద్రబాబు చిదంబరానికి ఎలాగూ లేఖ ఇవ్వరు. దీంతో టిటిడిపి చిక్కుల్లో పడినట్లుగా కనిపించింది. అయితే శనివారం టిడిపి నేత వేం నరేందర్ రెడ్డి జెఏసికి మరో సవాల్ విసిరారు. చంద్రబాబు లేఖ ఇస్తే తెలంగాణ ఇస్తామని చిదంబరంతో మాట ఇప్పిస్తే తాము తమ పార్టీ అధినేతతో లేఖ ఇప్పిస్తామని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో తమ ప్రాభవాన్ని కోల్పోకుండా ఉండటానికి టిడిపి, బలం పెంచుకోవడానికి టిఆర్ఎస్ రెండూ పార్టీలు సవాళ్ల మీద సవాళ్లు విసురుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications