ఆత్మరక్షణలో వైయస్ జగన్

వైయస్ జగన్ వ్యూహాలకు ప్రతివ్యూహాలను పకడ్బందీగా రచిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి అమలు చేస్తూ వస్తున్నారు. శానససభ్యుల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ జగన్ వ్యూహం బెడిసికొట్టింది. వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులను చాలా మందిని తన వైపు తిప్పుకోవడంలో కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. జగన్ వర్గం ఎమ్మెల్యేల వ్యూహానికి అనుగుణంగా కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహాన్ని మార్చుకుంటూ వెళ్లారు. దాంతో వైయస్ జగన్ కాంగ్రెసు అభ్యర్థి జానీని ఓడించలేకపోగా, మైనారిటీ అభ్యర్థిని ఓడించడానికి కుట్ర చేశారనే నిందను ఎదుర్కుంటున్నారు. ఈ సంఘటనను కిరణ్ కుమార్ రెడ్డి వచ్చే పులివెందుల, కడప ఉప ఎన్నికల్లో వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా వాడుకునే అవకాశాలు దండిగా ఉన్నాయి.
కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోమని, తన వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ఆత్మప్రబోధానుసారం ఓటు చేయాలని చెప్పిన వైయస్ జగన్ స్థానిక సంస్థల పరిధిలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్ని చోట్ల అభ్యర్థులను రంగంలోకి దించింది. ఈ స్థానాల్లో కూడా జగన్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కడప జిల్లాలో వైయస్ జగన్ వర్గానికి చెందిన అభ్యర్థిని ఓడించడానికి మంత్రులు వైయస్ వివేకానంద రెడ్డి, డిఎల్ రవీంద్రా రెడ్డి, కన్నా లక్ష్మినారాయణ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. వైయస్ జగన్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుంటున్నారనేది స్పష్టమవుతూ ఉన్నది.