• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హీటెక్కిన స్టేట్: చిరుతో డిసిఎం, గవర్నర్‌తో సిఎం

By Srinivas
|

Chiranjeevi - Kiran Kumar Reddy
ఇటీవల రెండు రోజుల పాటు ఢిల్లీలో ఎపి రాజకీయ వేడెక్కిన విషయం తెలిసిందే. అది చల్లబడినట్లే కనిపించినప్పటికీ సోమవారం మరోసారి హైదరాబాదులో రాజకీయ వేడి కనిపించింది. పార్టీలోని ముఖ్య నేతలు ఒకరితో మరొకరు భేటీలు, హడావుడిలు అంతా ఏదో జరిగిపోతుందన్నట్లుగా కనిపించింది. ఇలా ముఖ్యనేతల భేటీపై కాంగ్రెసులో కూడా తీవ్రమైన చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీ పర్యటన అనంతరం రాష్ట్రంలో రాజకీయ భేటీలు ఊపందుకున్నాయి.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాక రాష్ట్ర నాయకత్వంపై అధిష్ఠానం తన వైఖరి వెల్లడిస్తుందని అధికారపక్ష నేతలు జోరుగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో... గ్రూపుల వారీగా చర్చలు సాగుతున్నాయి. ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన వెంటనే డిప్యూటీ సిఎం దామోదర రాజ నర్సింహకు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఫోన్ చేశారు. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికకు చట్ట బద్ధత కల్పించేందుకు చేస్తున్న కృషిని అభినందించారు.

ఇరువురు చిరంజీవి నివాసంలో భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై దాదాపు గంట సేపు చర్చించుకున్నారు. ఇటీవల ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో జరిగిన సమావేశం వివరాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. సోమవారం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో రాజనర్సింహ సమావేశమయ్యారు. ఈ భేటీలోనూ రాష్ట్ర రాజకీయ పరిణామాలు, నాయకత్వ మార్పు తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ నెల 31న జరిగే కేబినెట్ భేటీ తర్వాత ఢిల్లీ వెళ్లి రావాలనుకుంటున్నట్లుగా రాజనర్సింహ పేర్కొన్నట్లు తెలిసింది.

అదే విధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డితో బొత్స సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనూ రాష్ట్ర సమకాలీన రాజకీయ వ్యవహారాలపై చర్చించుకున్నారు. తర్వాత .. మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, బాలరాజులు కూడా బొత్సతో సమావేశమయ్యారు. సచివాలయంలో మంత్రులు బస్వరాజు సారయ్య, పితాని సత్యనారాయణ, కోండ్రు మురళీ మోహన్, ఏరాసు ప్రతాపరెడ్డి, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సిఎంతో భేటీ అయ్యారు. ఈ భేటీలో వారి వారి శాఖలకు సంబంధించిన అంశాలతో పాటు.. రాజకీయాంశాలు కూడా చర్చకు వచ్చాయని సమాచారం.

సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో పిసిసి అధ్యక్షుడు బొత్స సమావేశమయ్యారు. ఈ భేటీలో రాజకీయాంశాలు చర్చకు వచ్చాయి. రాత్రి 8.30 గంటలకు ముఖ్యమంత్రి కిరణ్ కూడా గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరపాటు గవర్నర్‌తో చర్చలు జరిపారు. తన ఢిల్లీ పర్యటన వివరాలను ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో పాటు రాష్ట్రంలో సమస్యాత్మకంగా మారిన ఫీజులు, విద్యుత్ కొరత, ఆస్పత్రుల్లో శిశు మరణాల అంశాలపైనా ఆయన చర్చించారు.

English summary
Rajyasabha Member Chiranjeevi has met DCM Damodara Rajanarsimha on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X