2014 టార్గెట్: నల్లగొండ నుంచి కెసిఆర్ పోటీ?

K chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వచ్చే ఎన్నికల్లో నల్లగొండ లోకసభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. దక్షిణ తెలంగాణలో తెలంగాణవాదం అంతగా లేదనే వాదనలను తిప్పికొట్టడానికి ఆయన ఈ సీటును ఎంపిక చేసుకోనున్నట్లు చెబుతున్నారు. అయితే, నల్లగొండ జిల్లాలోని భువనగిరి సీటు నుంచి పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. భువనగిరి లోకసభ స్థానంలో తెరాస బలంగానే ఉంది. తెలంగాణవాదం కూడా ఎక్కువగానే ఉంది.

నల్లగొండ లోకసభ స్థానంలోనే తెలంగాణవాదం అంత బలంగా లేదనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పార్టీని నిలబెట్టడానికి వ్యూహాత్మకంగా నల్లగొండ సీటును కెసిఆర్ ఎంపిక చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం నల్లగొండ, భువనగిరి స్థానాలకు కాంగ్రెసు పార్టీకి చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తమ పార్టీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వెల్లడించకపోతే వారిద్దరు కూడా జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే తమకు ప్రధాన ప్రత్యర్థి అవుతుందని భావిస్తున్న కెసిఆర్ నల్లగొండ జిల్లాలో ఆ పార్టీని దెబ్బ తీస్తే మిగతా జిల్లాల్లో అది సులభమవుతుందని భావిస్తున్నారని అంటున్నారు. తన వ్యూహంలో భాగంగానే ఈ నెల 23వ తేదీన కెసిఆర్ పార్టీ బహిరంగ సభను సూర్యాపేటలో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తెలంగాణవాదమంటే తెలియని హుజూర్ నగర్ శాసనసభా నియోజకవర్గంలో తెరాస అభ్యర్థిగా జగదీశ్వర్ రెడ్డి పోటీ చేసిన తర్వాత మార్పు వచ్చింది.

కరీంనగర్ లోకసభ స్థానంలో గత ఎన్నికల్లో తెరాస అభ్యర్థి ఓడిపోయారు. అయితే, గెలిచిన కాంగ్రెసు అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమంలో బలంగా గొంతు వినిపిస్తున్నారు. తమ పార్టీ ఓడిపోయినప్పటికీ తెలంగాణ ఉద్యమ బలోపేతానికి పనికి వచ్చిందని కెసిఆర్ భావిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా గతంలో కన్నా తెలంగాణవాదం బలపడిందని భావిస్తున్నారు. తాను మహబూబ్‌నగర్ లోకసభ స్థానానికి పోటీ చేయడం కారణంగానే ఆ మార్పు వచ్చిందని ఆయన భావిస్తున్నారు.

నాగం జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పడం, జూపల్లి కృష్ణా రావు తెరాసలోకి రావడం, మహబూబ్ నగర్ నుంచి బిజెపి అభ్యర్థి తెలంగాణవాదంతో గెలవడం వంటి పరిణామాలు మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. నల్లగొండ జిల్లాలో పూర్తిగా తెలంగాణవాదాన్ని విస్తరింపజేయడానికి తాను పోటీ చేయడం అవసరమని, అదనంగా మరో సీటు గెలుచుకునే అవకాశాలుంటాయని కెసిఆర్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+