రాజ్‌నాథ్‌తో సుజనా భేటీ: ఉమ్మడి సంస్థలపై ఎపి మెలిక
న్యూఢిల్లీ: హైదరాబాదులోని ఉమ్మడి సంస్థల విభజనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెలిక పెట్టింది. హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి సంస్థలను విభజించవద్దని, రెండు రాష్ర్టాలు సంయుక్తంగా నిర్వహించుకునేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని కొత్త వివాదానికి తెరలేపింది. కేంద్ర మంత్రి సుజనాచౌదరి నేతృత్వంలో ఎంపీ సీఎం రమేశ్, ఆంధ్ర డీజీపీ జేవీ రాముడు శుక్రవారం పార్లమెంటు ఆవరణలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ను కలిసి ఉమ్మడి సంస్థలపై చర్చించారు.
ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో మర్రి చెన్నారెడ్డి మానవవనరుల సంస్థ, అప్పా, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ తదితర సంస్థలను విభజించవద్దని, కేంద్ర పర్యవేక్షణలో రెండు రాష్ర్టాల సంయుక్త నిర్వహణలో పనిచేసేలా చొరవ తీసుకోవాలని వారు రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. ఈ సంస్థల పాలకమండళ్ళలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి ఇద్దరు చొప్పున డైరెక్టర్ తరహా ఉన్నత పోస్టుల్లో నియామకాలుచేసి కేంద్రం పర్యవేక్షిస్తూ ఉండాలని రాజ్‌నాథ్‌కు సూచించారు.

ఉమ్మడి సంస్థలను కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 23 జిల్లాలను దృష్టిలో పెట్టుకుని స్థాపించారని, కేవలం తెలంగాణలోని పది జిల్లాలు మాత్రమే వినియోగించుకునేలా విభజన జరిగినట్లయితే ఆ సంస్థల సేవలను పూర్తిగా వినియోగించుకోలేమని వారు చెప్పారు. ఉమ్మడి సంస్థలను తెలంగాణ రాష్ట్రం మాత్రమే వినియోగించుకోవడం అంటే పరిమితులు విధించడమేనని, ఎంతో సామర్ధ్యం ఉన్న ఆ సంస్థల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోవడమే అవుతుందని రాజ్‌నాథ్‌తో భేటీ తర్వాత సుజనా చౌదరి మీడియాతో చెప్పారు.
ఉమ్మడి నిర్వహణను డిమాండ్ చేయడమంటే ఆ సంస్థలపై హక్కులను కూడా డిమాండ్ చేయడమే కదా అని ప్రశ్నించగా, కేంద్ర పర్యవేక్షణను కూడా కోరుతున్నాం గదా అని బదులిచ్చారు. ఏపీ ఇప్పుడు తనకు స్వంతంగా ఇలాంటి సంస్థలను ఏర్పాటు చేసుకోవాలంటే భూమి, భారీ స్థాయిలో ఆర్థిక వనరులు కూడా అవసరమవుతాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications