బ్యాంకాక్ పబ్ అగ్నిగుండం- 27 మంది సజీవదహనం: బాత్‌రూమ్‌లలో మృతదేహాలు

థాయ్‌లాండ్ లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. బ్యాంకాక్‌లో ఓ పబ్‌లో సంభవించిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 27 మంది ప్రాణాలు సజీవదహనం అయ్యారు. మరో 63 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృత్యువుతో పోరాడుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదం జరిగిన సమయంలో పబ్ లోపల పెద్ద సంఖ్యలో స్థానికులతో పాటు పర్యాటకులు కూడా ఉన్నారు. బ్యాంకాక్ సమీపంలోని చటుచక్ జిల్లా ఛోమ్ ఫోన్ లో అత్యంత రద్దీగా ఉండే రాంగ్ బీర్ నా లాట్ ఫ్రావో పబ్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో స్థానికులతో పాటు పర్యాటకులు పబ్ కు చేరుకున్నారు. అర్ధరాత్రి 11:57 నిమిషాల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.

Deadly Nighttime Pub Fire in Thailand Bangkok Claims 27 Lives 63 injured have been hospitalised

అక్కడున్న అల్కహాల్, ఇతర వస్తువులన్నీ కూడా మంటలు త్వరగా వ్యాప్తి చెందడానికి సహకరించేవే కావడంతో చూస్తూండగానే అగ్నికీలలు వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు భవనం మొత్తాన్ని చుట్టుముట్టాయి. లోపల ఉన్నవారికి తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. ప్రధాన ద్వారం వద్ద పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో కస్టమర్లు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి లోపలి వైపే పరుగులు తీయాల్సొచ్చింది.

అగ్నికీలలు చుట్టుముట్టడంతో తమ ప్రాణాలు కాపాడుకోవడానికి లోపల ఉన్న చాలా మంది పబ్‌లోని బాత్‌రూమ్‌లలోకి వెళ్లి తలదాచుకున్నారు. అదే వారి ప్రాణాలను తీసింది. దట్టమైన పొగ, విషవాయువులు కమ్ముకోవడంతో ఊపిరాడక వారంతా బాత్‌రూమ్‌లలోనే శ్వాస విడిచారు. రెస్క్యూ సిబ్బంది లోపలకు వెళ్లినప్పుడు అత్యధిక మృతదేహాలు అక్కడే లభ్యం కావడం దీనికి నిదర్శనం. మృతదేహాలను చూసి సహాయక సిబ్బంది షాక్ కు గురయ్యారు.

దాదాపు రెండుగంటల పాటు ప్రాణాలకు తెగించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం అనంతరం పబ్ లోపలి దృశ్యాలు అత్యంత దయనీయంగా కనిపించాయి. లోపల ఉన్న ఖరీదైన ఫర్నిచర్ పూర్తిగా కాలి బూడిదైపోయింది. వాటి మధ్య నుంచి పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. గాయపడ్డ వారిని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. అంబులెన్సులు, పోలీసులు, అగ్నిమాపక వాహనాల సైరన్ మోతలతో సంఘటన స్థలం భీతావహంగా మారింది.

థాయ్ లాండ్ ప్రధానమంత్రి అనుతిన్ చార్న్‌విరాకుల్, బ్యాంకాక్ గవర్నర్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. ఇప్పటివరకు 27 మంది మరణించారని ఆయన అధికారికంగా ధృవీకరించారు. క్షతగాత్రులను తక్షణమే సమీప ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. వారిలో 22 మంది పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు.

ఈ ఘోర ప్రమాదంతో థాయ్ లాండ్‌లోని ఎంటర్‌టైన్‌మెంట్ క్లబ్‌లు, పబ్‌లలో అగ్నిప్రమాద నియంత్రణ ఏర్పాట్లపై మళ్లీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ ఇటువంటి సంఘటనలు దేశాన్ని కుదిపేశాయి. 2022లో థాయ్ లాండ్ తూర్పు ప్రాంతంంలోని ఓ మ్యూజిక్ పబ్‌లో జరిగిన ప్రమాదంలో 14 మంది మరణించారు. అంతకుముందు 2009లో బ్యాంకాక్‌లోని శాంతికా నైట్‌క్లబ్‌లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బాణసంచా కాల్చడం వల్ల సంభవించిన అగ్నిప్రమాదంలో 66 మంది ప్రాణాలు కోల్పోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+