ఉలిక్కి పడ్డ ఫిల్మ్ ఇండస్ట్రీ.. !!
బాలీవుడ్‌తో పాటు దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో ఆదాయపు పన్ను శాఖ ఆకస్మిక దాడులు చేపట్టింది. పన్ను ఎగవేత, సినిమాల పేరుతో విదేశాలకు నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో ముంబై ఐటీ విభాగం ఒకేసారి పలువురు సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్, నిర్మాత వాసు భగ్నానీతో పాటు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్‌కు చెందిన సుమారు 12 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతుండటంతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది.
విదేశాల్లో సినిమాల చిత్రీకరణ, ఓవర్సీస్ పంపిణీ హక్కులు, చిత్ర నిర్మాణ వ్యయాల పేరుతో భారీ మొత్తంలో నిధులను ఇతర దేశాలకు తరలించినట్లు ఆదాయపు పన్ను శాఖకు పక్కా సమాచారం అందడం.. ఈ మెరుపు దాడులకు కారణమైంది. ఈ లావాదేవీల్లో పెద్ద ఎత్తున పన్నుల అవకతవకలు, ఆర్థిక అక్రమాలు జరిగినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తోన్నాయి. నిధుల మళ్లింపు వెనుక ఉన్న అసలు కారణాలను వెలికితీయడానికి ముంబై ఐటీ విభాగానికి చెందిన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

ఈ దాడుల్లో ప్రధానంగా నిలిచిన నిలిచిన నటి.. రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు, తమిళ ప్రేక్షకులతో పాటు హిందీ చిత్ర పరిశ్రమలోనూ మంచి పాపులారిటీ సాధించారు. ఆమె వ్యక్తిగత వ్యాపారాలు, సినిమాలకు తీసుకుంటున్న పారితోషికాలు, విదేశీ పెట్టుబడులకు సంబంధించిన వివిధ బ్యాంక్ ఖాతాల డాక్యుమెంట్లను అధికారులు తనిఖీ చేస్తోన్నట్లు సమాచారం. మరోవైపు బాలీవుడ్‌లో పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించి విజయాలను అందుకున్న ప్రముఖ నిర్మాత వాసు భగ్నానీపై కూడా ఐటీ నిఘా వేసింది.
ఇటీవలి కాలంలో ఆయన సంస్థ నిర్మించిన చిత్రాల ఆర్థిక లావాదేవీలు, ఖర్చుల వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ సిరీస్ దృశ్యం చిత్రాలను నిర్మించి ఘనవిజయం సాధించిన పనోరమా స్టూడియోస్ సైతం ఐటీ శాఖ రాడార్ పరిధిలోకి వచ్చింది. ఈ చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన వివిధ కార్యాలయాల్లో కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు, కమ్యూనికేషన్ రికార్డులు, బ్యాంకు ఖాతాల లావాదేవీలను అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
విదేశాలలో చిత్రాల పంపిణీకి సంబంధించిన డాక్యుమెంట్లు, కాల్షీట్లను కూడా దర్యాప్తు బృందాలు పరిశీలనలో తీసుకున్నట్లు చెబుతున్నారు. చలనచిత్ర పరిశ్రమలో పెద్ద ఎత్తున నిధుల ప్రవాహం సాగే విదేశీ పంపిణీ, ప్రొడక్షన్ వ్యవహారాలలో పన్నులు ఎగ్గొట్టేందుకు చట్టవిరుద్ధ మార్గాలను ఎంచుకున్నట్లు అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే ఆదాయపు పన్ను శాఖ అత్యంత పకడ్బందీ ప్రణాళికతో రంగంలోకి దిగి ఈ సోదాలు ప్రారంభించింది.













Click it and Unblock the Notifications
