తెలంగాణకు వరుణుడి హెచ్చరిక: రానున్న రెండు రోజులు ఈ జిల్లాలలో భారీ వర్షాలు!
తెలంగాణలో ఎల్ నినో ప్రభావం కారణంగా ఈసారి అంతగా ఆశించిన మేరకు వర్షాలు పడలేదు. మరోవైపు రుతుపవనాలు కూడా వెళ్ళిపోవటంతో ఇక వర్షాలు పడవని అందరూ భావించారు . కానీ తెలంగాణాలో తాజాగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవల కాలంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో వర్షాలు కురిశాయి.
ఇక తాజాగా రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిక జారీ చేశారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో కూడా ఆకాశం మేఘావృతంగా ఉండి, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్ లో నేడు సాయంత్రానికి ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో.. ముఖ్యంగా కూకట్‌పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, సికింద్రాబాద్, అల్వాల్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు పంటల రక్షణకు చర్యలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణం మారుతూ ఉంది కాబట్టి తాజా అప్‌డేట్‌లు గమనిస్తూ ఉండాలని అధికారులు కోరారు. రాబోయే రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications
