యూపీఐ ఛార్జీల పెంపుపై సుప్రీంకోర్టు తాజా నిర్ణయం: ఆర్బీఐ + కేంద్రానికి తక్షణమే.. !!
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేసే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ మర్చంట్ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ విధించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ఈ పిటిషన్‌పై నోటీసులు ఇచ్చింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)లకు ఈ నోటీసులు అందాయి.
దేశంలో డిజిటల్ చెల్లింపులను ఉచితంగా అందించడం ద్వారా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం మొదట్లో భావించిన విషయం తెలిసిందే. డిజిటల్ చెల్లింపులు రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో కేంద్రం వాటిపై ఛార్జీలను విధించాలని నిర్ణయించింది. దీనివల్ల చిన్న వ్యాపారులు, సాధారణ వినియోగదారులపై పరోక్షంగా ఆర్థిక భారం పడుతుందని, దీన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది.

దీన్ని విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలోనే తాజా నోటీసులు ఇచ్చింది. కొన్ని ప్రత్యేక రకాల యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ వసూలు చేయడానికి గల చట్టపరమైన ప్రాతిపదిక ఏమిటో స్పష్టంగా లిఖితపూరకంగా సమగ్ర వివరణలను అందజేయాలని ఆదేశించింది. ఈ విధానం వెనుక ఉన్న చట్టబద్ధతపై పూర్తి స్పష్టత ఇవ్వాలని కోరింది. అసలు ఈ చార్జీలను వసూలు చేయడానికి చట్టంలో ఎటువంటి నిబంధనలు ఉన్నాయనేది కూడా వివరించాలని సూచించింది.
అంతేకాకుండా ఈ విధంగా వసూలు చేసే ఛార్జీల ద్వారా లభించే ఆదాయం ఎవరి ఖాతాలోకి వెళ్తుంది, ఆ మొత్తాన్ని డిజిటల్ నెట్‌వర్క్‌లో భాగస్వాములుగా ఉన్న వివిధ సంస్థల మధ్య ఏ విధంగా విభజిస్తారు.. అనే అంశాలపై పూర్తి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సమయంలో ఈ ఎండీఆర్ ఛార్జీల అమలు ప్రక్రియపై తక్షణమే స్టే విధించాలని పిటిషనర్ కోరినప్పటికీ, సుప్రీంకోర్టు అందుకు నిరాకరించింది. ప్రస్తుతానికి ఎలాంటి స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది.
తదుపరి విచారణను కొనసాగించాల్సి ఉందని, ఈ క్రమంలో ప్రతివాదుల వాదనలను కూడా వినాల్సి ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేంద్రం, ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐలు తమ వివరణాత్మక అఫిడవిట్లను దాఖలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అధికారికంగా సమాధానాలు అందిన తర్వాతే తాము తుది నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications
